ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి వచ్చేనెల 23 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాలల్లో కీలకమైన సాగు చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. దీన్ని మొదటి రోజైన ఈరోజే కేంద్రం సభలో ప్రవేశపెట్టనుంది. ఇవాళ లోక్‌సభ ఆమోదం తర్వాత ఈ బిల్లును రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. ఇవాళ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాల భేటీ ఉంది.


అయితే.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీకి దిశా నిర్దేశం చేశారు. ధాన్యం సేకరణపై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సూచించారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆయన సూచించారు. కేంద్రం యొక్క అయోమయ, అస్పష్టత విధానానాలు దేశ వ్యవసాయ రంగానికే  ఇబ్బందికరంగామారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కార్ వైఖరిపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేసీఆర్ ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్రం వైఖరి, రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలు వంటి అంశాలపై ఎంపీలతో చాలాసేపు మాట్లాడారు. వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంపై కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని కేసీఆర్ అన్నారు. కేంద్రం 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటే.. కేవలం 60 లక్షలే సేకరిస్తామని చెబుతోందని కేసీఆర్ అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఆహార ధాన్యసేకరణకు సమగ్ర జాతీయ విధానాన్ని ప్రకటించాలని... ఈ దిశగా ఎంపీలు ఒత్తిడి చేయాలని కేసీఆర్ సూచించారు.

 

టీఆర్ఎస్ మంత్రులు కేంద్ర మంత్రులు, అధికారులను ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని కేసీఆర్ అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తేల్చక పోవడంపై సమావేశంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: