మార్నింగ్ రాగా : ఇంకా ఆ త‌ల‌పు.. వ‌సి వాడదే...
........................................................................

ఓ ప‌సికందు పుట్టి ఈ లోకాన్ని కొన్ని నెలలుగా చూస్తోంది..
అదే స‌మ‌యంలో..
ఓ పాట పుట్టి ఈ లోకాన్ని త‌న్మ‌య‌ప‌రుస్తోంది..
తాదాత్మ్యానికి గురిచేస్తోంది
పాట ఎక్క‌డో వాగులో పుట్టింది నెల‌వంక‌గా మెరిసింది
నాతో పాటే ఈ పాట నా జ‌న్యుగతమైపోయింది
ఇది జీవ‌న నాదం ఇది విధాత త‌ల‌పు నాలో ప్ర‌భ‌వించిన‌ది..
నాతోనే ప్రయాణిస్తుంది కొన్నేళ్లుగా..
........................................................................



ఎక్క‌డిది ఈ గ‌ళం.. ఎక్క‌డిదీ స్వ‌రం.. మౌన శిల‌ల‌ను చైత‌న్య మూర్తులుగా మ‌ల‌చ‌డం సాధ్య‌మా??ఇది ఎవ‌రిదో ప్ర‌శ్న‌..నాది కానిదేదీ నాది కాదు క‌దా! అంత‌రంగానికి ఇదిగో ఇదే నీ వేద‌న‌కు నివేద‌న అని ఏ అక్ష‌ర రూపాన్ని చూప‌గ‌లం..మ‌నిషికేనా మాట‌కూ వ‌ర్ఛ‌స్సు ఉంటుంది.. పాట‌కు య‌శ‌స్సు ఉంటుంది.. అది నాలో ల‌యం.. అది అనాది రాగం..ఆదితాళం.. సామ‌వేద జ‌నితం స‌ర‌స స్వ‌ర సుర ఝ‌రీ గ‌మ‌నం.. ఔనండి ఈ పాట‌లో కొద్దిగా సంస్కృతం ఎక్కువ‌య్యింది.మీ ఆలోచ‌న‌లు సంస్క‌రించ‌గ వచ్చిన పాట క‌దా ఇది!! అలానే ఉంటుంది! రండి ఒక్క‌సారి ఎల్లారెడ్డిగూడ‌కి పోదాం. లేదా అన‌కాప‌ల్లిపోదాం.చేంబోలు వారింటి అబ్బాయి అమ‌లాపురం ఆర్ఎస్ఎస్ స‌భ‌ల లో పాట‌లు పాడిన రోజులు ప‌ల‌క‌రించి వ‌ద్దాం.. త‌ప్పో ఒప్పో ఆ అహంకారాన్ని అంగీక‌రిద్దాం. ఆ స‌ర‌స్వ‌తి రూపానికి ప్ర‌ణ‌మిల్లుదాం. ఔనండి! ఇది జీవ‌న వేదం క‌దా! గుండె గూటి నుంచి ప‌ల్ల‌వించిన ఓ గొప్ప పాట క‌దా! మీ నేల‌లోనో మీ నింగిలోనో ఈ పాట మూలాలు ఉంటాయి వెత‌కండి.
........................................................................

సృష్టి విలాసాన్ని ఎలా వ‌ర్ణించాలి.. ఆ స్వ‌రం ఆ గ‌ళం ఎక్క‌డ ఎప్పుడు మంగ‌ళ‌క‌ర‌మై జ‌నుల ఆమోదానికి నోచుకుంటుందో మీకు తెల్సా. ఆ ప్ర‌భాత రాగానికి మూర్ఛ‌న మీరు రాయ‌గ‌ల‌రా?? ఇవే ప్ర‌శ్న‌లు.. ప్రాగ్దిశ వీణ‌ను మీటితే దిన‌క‌ర మ‌యూఖ తంత్రుల‌ను మీటితే జ‌నించు ఉద‌యం ర‌స ప్లావితం. చేత‌న పొందాలిగా మీరు పొందండి స్పంద‌న‌లు క‌లిగే ఉండాలిగా ఒక్క‌సారి మిమ్మ‌ల్ని మీరు అడిగి తెల్సుకోండి.. ఏది హృద‌యగ‌తం..ఏది ఆత్మ‌గ‌తం.. ఏది విత‌తి ఏది వినుతి.. సంగీతం ఎక్క‌డిది ఆ కూజిత స్వ‌రం ఆ కిలకిలార‌వం విశ్వ‌కావ్యానికి ఆది కాదా అనాది కాదా! అందుకోస‌మే ఇది అనాది రాగం ఆదితాళం..  మ‌ళ్లీ వినండి ఇది విధాత త‌ల‌పు.. ప్ర‌భ‌వించిన కావ్యం ప్ర‌కృష్ట రూపం. సార‌స్వ‌త పీఠం.
........................................................................
గానం ఎలా పుడుతుంది జీవం ప్రారంభ స్థానం ఏది??
జాగృతం ఏది ? వినీలం ఏది ??
వినీలం చెంత విహంగం వినిపించే స్వేచ్ఛా స్వ‌రం ఏది??  
మీకు తెల్సా??
........................................................................
ప‌రికించి ప‌రికించి చూస్తే ఇది హృద‌య మృదంగ ధ్వానం అవునా!! మీలోనే ఉన్న ఈ క‌ళ‌కు జ‌వాబుదారి మీరే! వెలికి తీస్తారో.. వెలుగులిస్తారో...అన్న‌ది కూడా మీ ఇష్ట‌మే! ఇది అనంత జీవ‌న వాహిని.. క‌నుక ఉచ్ఛ్వాశం క‌వ‌నం నిశ్వాసం గానం. అంతే!! ఆ నాదం చెవుల‌తో వినేది కాదు క‌ళ్ల‌తో చూసేది కాదు అని అంటారు సిరివెన్నెల సీతారాముడు. మ‌రి! ఇక మీ స్పంద‌న అక్ష‌ర రూపం గావించండిలా.. పాట మ‌ళ్లీ మ‌ళ్లీ వింటూ..తొలుత చెప్పుకున్న ఆ ప‌సికందు నేను ఆ పాటకూ నా వ‌య‌స్సుకూ ఇంకా నాలో క‌లిగే స్పంద‌న‌ల‌కు మూడు ప‌దులు. ఇంకా వేన‌వేల ప‌లుకులు ఇలా నాలో..! సీతారామ శాస్త్రి గారూ! మీతో విభేదం ఉన్నా మీలో ఉన్నఆ వాగ్దేవి రూపానికి వంద‌నం.అమ్మ‌లాంటి నేస్తానికి పాదాభివంద‌నం.
........................................................................

........................................................................
మొత్తంగా ఇది..
"క‌నుల కొల‌నులో ప్ర‌తిబింబించిన విశ్వ‌రూప విన్యాసం..
ఎద క‌నుమ‌ల‌లో ప్ర‌తిధ్వ‌నించిన విరించి విపంచి గానం"
ఇంతే ఇంత‌కుమించి ఏమీ మాట్లాడ‌రాదు..హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్‌
- శుభాకాంక్ష‌ల‌తో శంభుమ‌హంతి
పిక్ డిజైన్ :  గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి


మరింత సమాచారం తెలుసుకోండి: