ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఓ వైపు అప్పులు, మరో వైపు ఆర్థిక సమస్యలు, ఇంకో వైపు వరద కష్టాలు, అటు ప్రతిపక్షాల ఆరోణలు, ఇటు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు... ఇదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరో తలనొప్పిగా మారారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఉద్యోగులపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏ బకాయిలను వెంటనే అందిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తామన్నారు వైఎస్ జగన్. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి అయినా కూడా... పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యమ కార్యాచరణ నోటీసులను ఉద్యోగ సంఘాల నేతలు ఇచ్చారు. నెల రోజులుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి అలిసిపోయామన్నారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. పీఆర్‌సీ, డీఏ వంటి మొత్తం 45 డిమాండ్లు పరిష్కరించాలని వేడుకున్నామన్నారు. అయితే ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే ఉన్నాయి తప్ప అమలు కాలేదన్నారు. తాము ప్రకటించిన కార్యాచరణను యధావిధంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేదన్నారు. తమకు 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇక తాము దాచుకున్న 16 వందల కోట్లు ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. నవంబర్ నెలాఖరు నాటికి అన్ని సమస్యలు పరిష్కారిస్తామని గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలతో పాటు మిగతా పెద్దలు కూడా చెప్పారని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణమని బొప్పరాజు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: