టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ పై వంశీ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై భువనేశ్వరికి సారీ చెప్పారు. పొరపాటుగా మాట్లాడానని ఒప్పుకున్నారు. బాధ కలిగించినందుకు తనను క్షమించాలని కోరారు. తన మాటల వలన ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే వారికికూడా క్షమాపణ చెప్తానని అన్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించిన ఈ వ్యాఖ్యలు, ఒక్క సారీతో సర్దుకుంటాయా లేదా అనే విషయం మాత్రం మరికొద్దిరోజులైతే గానీ చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలతో పాటూ అటు కమ్మ సామాజిక వర్గంలోనూ ప్రకంపనలు సృష్టించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ వ్యాఖ్యలపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో టీడీపీకి బాగా సింపతీ పెరిగింది. మరోవైపు అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి వంశీపై బాగానే ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కొన్ని కమ్మ సంఘాల సమావేశాలకు కూడా వంశీని దూరం పెట్టినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా కమ్మ సామాజిక వర్గ కార్యక్రమాలకు వంశీని పిలవకూడదని కమ్మసంఘాల నేతలు తీర్మానించినట్టు కూడా వార్తలొచ్చాయి. అందుకే వంశీ వెనక్కు తగ్గారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు లబ్ది పొందారని, ఈ విషయాన్ని ఇంతటితో ముగించేందుకే వంశీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే భువనేశ్వరిపై ఏ పరిస్థితుల్లో తాను ఆలా మాట్లాడాల్సి వచ్చిందో వంశీ చెప్పుకొచ్చారు. నారాలోకేష్ కి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసిన కారణంగానే అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు వంశీ. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పదజాలం వాడబోనని అన్నారు. భువనేశ్వరిని తాను అక్కలాగా భావించేవాడినని చెప్పుకొచ్చారు. ఎవరికీ భయపడి తాను సారీ చెప్పలేదని.. తప్పు చేశానని భావించిన కారణంగానే.. సారీ చెబుతున్నట్టు ప్రకటించారు. తన వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకున్న చంద్రబాబుపై మాత్రం తన పోరాటం ఆగదని చెప్పారు. ఇకపై తన జోలికొస్తే చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే వంశీ సారీపై ఇంకా ఎవరూ స్పందించలేదు. స్పందనలు మొదలైతే ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: