సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ మనవుడి జీవితం సుఖవంతమవుతుంది.. అయితే.. అవే సౌకర్యాలు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ అందించే సౌకర్యాలు ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంటాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇందుకు ఓ ఉదాహరణ. నున్నటి హైవేలు.. ఎంత వేగమైనా దూసుకెళ్లే వాహనాలు కారణంగా వేగంగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.


కారు ప్రమాదాల సమయంలో కారులోని ముందు సీట్లలో కూర్చున్నవారు తరచూ ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఖరీదైన కారుల్లో మాత్రం ఎయిర్‌ బ్యాగ్‌ల సౌకర్యం ఉంటుంది. వీటి కారణంగా ప్రాణాలు దక్కుతాయి. అయితే.. ఈ సౌకర్యం చవకైన కారుల్లో ఉండదు.. ఇప్పుడు కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనతో అన్ని కార్లకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి తయారు చేసే వాహనాలకు కర్టెన్‌ లేదా ట్యూబ్‌ ఎయిర్‌ బ్యాగ్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 

ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి తయారు చేసే ఎం1 క్యాటగిరీ వాహనాలకు రెండు వైపుల‌ కర్టెన్ లేదా ట్యూబ్ ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి అంటూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఈ నిబంధన కారణంగా ఇక ప్రతి కారుకూ ఎయిర్‌ బ్యాగ్‌ల సౌకర్యం తప్పనిసరి అవుతుంది. దీని వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రత్యేకించి కారు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.


మరో విషయం ఏంటంటే.. ఈ కొత్త నిబంధన కారణంగా కార్ల ధరలు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించాలంటే కార్ల కంపెనీలకు అదనపు భారం తప్పదు కదా. మరి ఆ భారాన్ని వాళ్లు కొనుగోలు దారుల వద్దే కదా వసూలు చేసేది. అయితే.. కాస్త ధర ఎక్కువైనా అవి ప్రాణాలకు మించి కాదు కదా. మామూలుగా చెబితే ఎవరూ వినరు కాబట్టి.. ఇలాంటివి తప్పనిసరి చేస్తే తప్ప అమలు కావు. మొత్తానికి ఈ నిర్ణయంతో ఏటా వేల ప్రాణాలు గాల్లో కలవకుండా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: