ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఓ వైపు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ... అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి సారించాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని గద్దె దింపేందుకు విపక్షాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో పంజాబ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ అగ్రనేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ఎన్నికల్లో రైతులను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. 2020 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది కాలం పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరంతర పోరాటం చేశారు. చివరికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం... సరిగ్గా సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి రోజున నవంబర్ 19వ తేదీన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

నాటి నుంచి రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంజాబ్ ఎన్నికల్లో రైతు సంఘాలు ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే యూపీలో మాత్రం రైతులు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలు సమాజ్ వాదీ పార్టీకి, రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తీవ్రంగా స్పందించారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చారు రాకేష్ తికాయత్. ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి తాము మద్దతివ్వడం లేదన్నారు తికాయత్. అయితే విపక్ష కూటమికి మద్దతు విషయంలో గందరగోళం నెలకొందని ఆయన తెలిపారు. అటు భారతీయ కిసాన్ యూనియన్ నేత నరేష్ తికాయత్ మాత్రం... తాము ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ-ఆర్ఎల్‌డీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీకేయూతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు రాకేష్ తికాయత్. తాము కేవలం రైతుల శ్రేయస్సు గురించి మాత్రమే చర్చించుకుంటామని... రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు రాకేష్ తికాయత్.


మరింత సమాచారం తెలుసుకోండి: