ఇపుడిదే అంశం అధికార వైసీపీలో హాట్ టాపిక్ అయిపోయింది. రెండున్నరేళ్ళల్లో నియోజకవర్గం ఇన్చార్జీలుగా ముగ్గురు మారారంటేనే పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉందికాబట్టి నియోజకవర్గాల్లో సరైన నేతలేక ఇబ్బందులు పడుతోందంటే అర్ధముంది. కానీ అధికారంలో ఉండికూడా దాదాపు అదే ఇబ్బందులు వైసీపీ కూడా ఎందుకు ఫేస్ చేస్తోందో ఎవరికీ అర్ధం కావటంలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే నేతలను అంతగా భయపెడుతున్న నియోజకవర్గం రాజమండ్రి సిటి. 2019 ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీచేసిన రౌతు సూర్యప్రకాష్ రావు ఓడిపోయారు. సరే ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రౌతునే పార్టీ ఇన్చార్జిగా నియమించింది. కొంతకాలం తర్వాత ఏమైందో ఏమో రౌతు రాజీనామా చేసేశారు. పార్టీలోనే యాక్టివ్ గా ఉన్నారు కానీ ఇన్చార్జి బాధ్యతలు వద్దంటే వద్దంటున్నారు. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతోంది. మరపుడు ఎవరిని ముందుంచి ఎన్నికలు తంతు పూర్తిచేస్తారో అర్ధం కావటంలేదు. 
సరే రౌతు తప్పుకున్నారు కాబట్టి తర్వాత శివరామ సుబ్రమణ్యంను ఇన్చార్జిగా నియమించారు. ఆయనా కొంతకాలం బాగానే పనిచేశారు. ఆ తర్వాత ఈయనకు ఏమైందో ఏమో ఇన్చార్జి పదవి తనకొద్దంటు రాజీనామా చేసేశారు. స్ధానిక నేతలు ఎంత వద్దనిచెప్పినా నేరుగా జగన్మోహన్ రెడ్డినే కలిసి దణ్ణంపెట్టి మరీ పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో నుండి పార్టీలో చేరిన మాజీ ఎంఎల్ఏ ఆకుల సత్యానారాయణను పార్టీ ఇన్చార్జిగా నియమించింది.
కొంతకాలం పనిచేసిన తర్వాత ఈయన కూడా ఇన్చార్జి బాద్యతలు వద్దని చెప్పేశారట. జిల్లా ఇన్చార్జి, టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిసి రాజీనామా లేఖ అందించారట. అంటే రెండున్నరేళ్ళల్లో ముగ్గురు ఇన్చార్జిలు మారారంటేనే అసలు నియోజకవర్గంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అధికారంలో ఉన్నపార్టీకి ఏదైనా నియోజకవర్గంలో ఇన్చార్జి పదవంటే దాదాపు ఎంఎల్ఏతో సమానమే. అయినా ఆ పదవి వద్దంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: