ఉద్యోగసంఘాల నేతల తీరు ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉంది. పీఆర్సీ విషయంలో తాము అనుకున్నంతగా జీతాలు పెరగలేదని ఉద్యోగులు మండిపోతున్నారు. పైగా తమకు జీతాలు భారీగా తగ్గుతాయంటు నానా రకాలుగా గోల మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే వివిధ రూపాల్లో ఆందోళనలు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 7వ తేదీనుండి నిరవధిక సమ్మె చేయబోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి నోటీసు కూడా ఇచ్చారు.




ఇదే సమయంలో ఉద్యోగులు అనుకున్నంతగా కాకపోయినా జీతాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వ వాదనను ఉద్యోగనేతలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఇదిలా ఉంటే పీఆర్సీ సాధన సమితి నేతల్లో ఒకరైన  బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతు తమకు ఈనెల జీతాలు రాకుండా ప్రభుత్వం చూస్తోందన్నారు. తమకు జీతాలు అందకపోతే ఊరుకునేది లేదంటు పెద్ద వార్నింగే ఇచ్చారు. ఉద్యమ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను తీసుకురావటం ఏమిటనే అర్ధమొచ్చేట్లుగా మాట్లాడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడితే తేడా తెలిసిపోతుందన్న ఉద్దేశ్యంతోనే పాత జీాతాలనే కావాలంటున్నారు. ప్రభుత్వం కొత్త జీతాలను వేస్తామంటే వద్దంటున్న కారణమిదే. 




అంటే బొప్పరాజు మాటలు ఎలాగున్నాయంటే ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగులు వినటం కాకుండా ఉద్యోగసంఘాల నేతలు చెప్పినట్లే ప్రభుత్వం వినాలనేట్లుగా ఉంది. జిల్లాల పునర్విభజనపై తాము చేయగలిగినంత చేస్తామే కానీ తమపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాల విభజన ప్రక్రియలో అధికారుల ఒత్తిళ్ళకు తాము లొంగేదిలేదంటు గట్టిగానే చెప్పారు.




అంటే బొప్పరాజు మాటలు వింటే తామడిగినంత జీతాలు ఇవ్వనపుడు తాము మాత్రం ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలనేట్లుగా ఉంది. తామడిగిన జీతాలు ఇస్తేనే తాము ప్రభుత్వానికి సహకరిస్తామని డైరెక్టుగానే బెదిరిస్తున్నట్లుంది. ఇప్పటికే ఉద్యోగులకు సమాజంలోని ఏ వర్గం నుండి సానుభూతి దొరకటంలేదు. కరోనా కష్టకాలంలో అధిక జీతాల కోసం ఉద్యోగులు సమ్మె చేయటం ఏమిటంటు జనాలు నిలదీస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ఇక బ్లాక్ మెయిల్ కు కూడా దిగితే సమాజం ఎలా రియాక్టవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: