జనసేన పార్టీ నేతల ప్రకటనలే చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ‘భీమ్లానాయక్’ సినిమా హిట్టయితే రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చేస్తుందా ? సినిమా హిట్టయితే జగన్మోహన్ రెడ్డి అహంకారం బద్దలైనట్లేనా ? సినిమా విజయవంతమైతే పవన్ కల్యాణ్ ఆత్మగౌరవం గెలిచినట్లేనా ? ఏమిటో జనసేన నేతలు వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉంటోంది. రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కూడా మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు.





అసలు సినిమా హిట్టవటానికి రాజకీయాలకు ఏమిటి సంబంధమో అర్ధం కావటంలేదు. సినిమా సినిమానే రాజకీయాలు రాజకీయాలే అన్న కనీస ఇంగితం కూడా మనోహర్ లాంటి వాళ్ళలోనే లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. భీమ్లా సినిమా హిట్టయితే రేపటి ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చేయటం ఖాయమన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. జనసేన అధికారంలోకి రావాలంటే సామాజికవర్గాలతో సంబంధం లేకుండా మెజారిటి జనాలు ఓట్లేస్తే మాత్రమే సాధ్యమవుతుంది.





ఏదో సినిమా హిట్టయిందని జనాలంతా ఓట్లేసేస్తారా ? పవన్ అభిమానులు ఒకటికి రెండుసార్లు చూస్తే సినిమా హిట్టవుతుందంతే. హిట్ సినిమాకు పవన్ అభిమానులు మొహాలు వాచిపోయున్నారు. కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. వకీల్ సాబ్ పెద్దగా ఆడలేదు. దాంతో పవన్ నుండి ఒక హిట్ సినిమా వచ్చి చాలా కాలమైంది. పైగా ఈ సినిమా మాతృక మలయాళం అప్పయున్ కోషియం పెద్ద హిట్ సినిమా. ఆ సినిమాను తెలుగువాళ్ళు కూడా ఓటీటీలో చూసేశారు. కాబట్టి రీమేక్ సినిమాపై అంచనాలు పెరిగిపోవటంతో అభిమానులు సినిమా చూడటానికి ఎగబడటంతో హిట్ టాక్ వచ్చేసింది.





సినిమా హిట్ అయినంత మాత్రాన జనసేన అధికారంలోకి వచ్చేయదు. ఎందుకంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళుంది. జనసేన అయినా, తెలుగుదేశంపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఒకటే మార్గముంది. అదేమిటంటే జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత రావాలి. జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రానంతవరకు ఎన్ని భీమ్లానాయక్ లొచ్చినా వైసీపీని ఓడగొట్టడం సాధ్యంకాదు. నిజంగానే జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేస్తే గెలుపుకు భీమ్లానాయకే అవసరం లేదు. జస్ట్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: