ఏంటీ హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోయారా.. హీరోయిన్ కోసం పార్టీల ఫైటింగ్ ఏంటి అనుకుంటున్నారా.. అవును.. మరి ఒక హీరోయిన్‌ను ఓడించాలంటే.. మరో హీరోయిన్‌ అవసరమే అని ఆ పార్టీలు భావిస్తున్నాయి. మరి అందుకే ఆ హీరోయిన్ కోసం ఆ రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఇంతకీ టీడీపీ, జనసేన ఓడించాలనుకుంటున్న హీరోయిన్ ఎవరు..ఆ హీరోయిన్ తో పోటీకి ముందుకు వస్తున్న మరో హీరోయిన్ ఎవరు.. ఇప్పుడు తెలుసుకుందాం..


చిత్తూరు జిల్లా నగరి నుంచి హీరోయిన్ రోజా ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. రోజా టీడీపీలో ఉన్నప్పటి నుంచే నగరిపై కన్నేశారు.. అప్పట్లో టీడీపీ నుంచి పోటీ చేసినా గెలుపు దక్కలేదు.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చాక నగరి నుంచి రోజా గెలిచారు. ఎమ్మెల్యే అయ్యారు. పాపం మంత్రి కూడా అవుతారనుకున్నా కొన్ని సమీకరణాలు ఆమెను మంత్రి కాకుండా చేశాయి. అయితే.. ఇప్పుడు ఇదే నగరిపై మరో హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కన్నేశారు.


ఇటీవల తరచు నగరిలో కనిపిస్తున్న ఒకనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్‌ తాను నగరి నుంచి పోటీకి సిద్ధం అని ఇప్పటికే ప్రకటించారు. ఇంతకూ నగరికీ వాణి విశ్వనాథ్‌ కూ లింకేమిటి అనుకుంటున్నారా.. పెద్ద లింకేమీ లేదు.. వాణి విశ్వనాథ్‌ అసిస్టెంట్‌ సొంత ఊరు నగరి అట. మరి అసిస్టెంట్ ఊళ్లో పోటీ చేయడం ఏంటి అనుకోకండి.. అదో సాకు మాత్రమే కావచ్చు. ఏదేమైనా తాను నగరి నుంచి పోటీకి రెడీ అంటున్నారు కానీ.. ఏ పార్టీ అని మాత్రం చెప్పలేదు.


ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది.. వైసీకి పోటీగా నిలిచిన పార్టీలు టీడీపీ, జనసేన మాత్రమే కదా.. మరి ఈ రెండు పార్టీల్లో వాణి విశ్వనాథ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. సహజంగానే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైపు ఆమె మొగ్గే అవకాశం ఉంది. అదిగో ఆ విషయాన్నే పసిగట్టారు నగరి జనసేన కార్యకర్తలు.. అందుకే.. అబ్బే వాణి విశ్వనాథ్‌ మా పార్టీ నుంచే పోటీ చేయాలని ఏకంగా ప్రదర్శన కూడా చేపట్టారు. వాణి విశ్వనాథ్ జనసేన నుంచి ఇక్కడ పోటీ చేస్తే గెలిపించుకునే పూచీ మాదీ అంటూ ఓ భారీ ప్రదర్శన నిర్వహించి ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి దీనిపై వాణి విశ్వనాథ్ ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: