అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సభకోసం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీకి రావాలనుకున్నారు. కానీ ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యలోనే వెనుదిరిగారు. ఏపీ పోలీసులు తనను అనుసరిస్తున్నారని, అందుకే తాను వెనుదిరిగి వెళ్లిపోతున్నట్టు తెలిపారు రఘురామకృష్ణంరాజు. ఆయన భయపడ్డారా, లేక ఆయనను ఎవరైనా బెదిరించారా అనే విషయం తేలాల్సి ఉంది.

ఏపీలో ప్రధాని మోదీ సభలో రఘురామ పాల్గొంటారని అనుకున్నారంతా. అయితే ఆయనకు ఆహ్వానం లేదని, కనీసం మోదీని రిసీవ్ చేసుకునే లిస్ట్ లో కూడా ఆయన పేరు లేదని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రఘురామ కూడా భీమవరం వస్తున్నారని ముందుగా సమాచారం వచ్చింది. సీఎం జగన్ తో విభేదించిన తర్వాత ఆయన నేరుగా వైసీపీ నాయకులకు తారసపడలేదు. పార్లమెంట్ లో కూడా వైసీపీ ఎంపీలతో ఆయన కలిసేవారు కాదు. ఇప్పుడు మోదీ సభకోసం సీఎం జగన్ కు ఆయన ఎదురు పడతారా..? ఒకే వేదికపై కూర్చుంటారా..? అసలు రఘురామను చూశాక జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనే అంచనాలున్నాయి. కానీ రఘురామ అసలు సభకే రాకుండా వెనుదిరిగారు. రైలు మధ్యలోనే దిగిపోయారు.

ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొంటానని గతంలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. సభకోసం ఆయన ఆదివారం రాత్రి ఏపీకి బయలుదేరారు. కానీ రైలు ఏపీకి రాకముందే ఆయన వెనుదిరిగారు. బేగంపేట రైల్వే స్టేషన్లో ఆయన దిగిపోయారు. శనివారం భీమవరంలో రఘురామకృష్ణంరాజుకి మద్దతుగా కొంతమంది యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తమ పిల్లలపై కేసులు పెట్టారని తల్లిదండ్రులు రఘురామకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దీంతో రఘురామ కృష్ణంరాజు కూడా వారి గురించి ఆలోచించారని, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన వెనుదిరిగారని చెబుతున్నారు. మొత్తమ్మీద రఘురామ ఎపిసోడ్ అలా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆయన వస్తే భీమవరంలో వైసీపీ నేతలు హడావిడి చేస్తారనుకున్నా అది జరగకుండానే ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr