బీహార్ లో రాజకీయాలు జెట్ స్పీడులో జరిగిపోతున్నాయి. అధికార భాగస్వాములైన జేడీయూ-బీజేపీ విడిపోయాయి. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజీనామా చేశారు. దాంతో ప్రభుత్వం కూలిపోయినట్లే అని అనుకోవాలి. తన రాజీనామాను నితీష్ గవర్నర్ కు అందించారు. మళ్ళీ ఆర్జేడీ+కాంగ్రెస్ తో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో నరేంద్రమోడీకి పెద్ద షాక్ తగిలిందనేచెప్పాలి.






సరే నితీష్ తరచూ పార్టనర్లను మారుస్తునే ఉంటారు. ఆయనకు బీజేపీ కొత్తకాదు ఆర్జేడీ కూడా కొత్తేమీకాదు. అయితే మొత్తంమీద గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్డీయే అంటే బీజేపీ మాత్రమే అన్నట్లుగా అయిపోయింది. ఎన్డీయేలో 20 పార్టీలున్నప్పటికీ సింగిల్ లార్జెస్టుపార్టీ మాత్రం బీజేపీ అనేచెప్పాలి. ఎన్డీయేకి 333 మంది ఎంపీల బలముంటే అందులో బీజేపీ ఒక్కదానికే 305 మంది ఎంపీలున్నారు. అంటే మిగిలిన భాగస్వామ్య పార్టీల్లో లోక్ జనశక్తి పార్టీకి 6 మంది ఎంపీలున్నారు.






మిగిలిన పార్టీలకు 1,2 సీట్లకు మించిలేవు. అంటే ఏ కారణం వల్లయినా బీజేపీ మీద దెబ్బపడితే ఎన్డీయే కుప్పకూలిపోవటం ఖాయం. బీజేపీ తరువాత పెద్దపార్టీ జేడీయూ వదిలేసింది. ఇంతకుముందే శివసేన వదిలేసింది. తమిళనాడులో ఏఐఏడీఎంకే ఉన్నా అంతఃకలహాల్లో నానా గొడవలతో ఉంది. పెద్దపార్టీలన్నీ బీజేపీని వదిలి వెళ్ళిపోవటానికి మోడీ వైఖరే కారణమని చెప్పాలి. ఇంతకుముందు పార్టీ వాజ్ పేయి, ఎల్కే అద్వానీ చేతుల్లో ఉన్నపుడు నమ్మకమైన మిత్రులుండేవారు.





ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రయ్యారో అప్పటినుండే ఎన్డీయేకి బ్యాడ్ టైం స్టార్టయ్యింది. కాకపోతే బీజేపీ బలంగా ఉందికాబట్టే ఎన్డీయే అధికారంలో నెట్టుకొచ్చేస్తోంది. మిత్రపక్షాలైనా సరే బలంగా ఉంటే దాన్ని కబళించేయాలన్న ఆలోచన కారణంగానే బలమైన మిత్రులు ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. మిత్రపక్షపార్టీల ఎంపీలు, ఎంఎల్ఏల్లో కూడా చీలిక తెచ్చి వారిని తమలో కలిపేసుకుంటున్న మోడీ వైఖరే భాగస్వామ్యపార్టీలకు అర్ధం కావటంలేదు. అందుకనే మోడీ ఒంటరైపోతున్నారు. మరి రేపటి ఎన్నికల్లో గట్టిమిత్రలు ఒక్కళ్ళుకూడా లేకుండానే ఎన్నికలను ఎలా గెలుస్తారన్నది ఆసక్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: