వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ సీటులో పోటీచేసే అభ్యర్ధి ఎంపిక విషయం కాస్త  ఇబ్బందిగానే మారింది. విజయవాడ పార్లమెంటుకు పోటీచేయాలంటే ఆర్ధికంగా బాగా పటిష్టమైన స్ధితిలో ఉన్న అభ్యర్ధి మాత్రమే ఉండాలి. ఎంత తక్కువ వేసుకున్నా ప్రతి అభ్యర్ధికి సుమారు రు. 120 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఇంత ఖర్చుపెట్టిన తర్వాత కూడా పలానా అభ్యర్ధి కచ్చితంగా గెలుస్తాడని చెప్పటానికి లేదు. అందుకనే పార్లమెంటు సీటులో పోటీచేయటానికి చాలామంది వెనకాడుతారు.





2014లో వైసీపీ తరపున కోనేరుప్రసాద్ పోటీచేశారు. 2019 ఎన్నికల్లో పొట్లూరి ప్రసాద్ పోటీచేశారు. ఇద్దరు కూడా టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ముగ్గురు అభ్యర్ధులు కూడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలే కాబట్టి డబ్బుకు లోటులేదు. మరి వచ్చే ఎన్నికల పరిస్ధితి ఏమిటి ? టీడీపీ తరపున కేశినేని పోటీచేస్తారో లేదో అనుమానంగా ఉంది. ఒకవేళ నానీయే పోటీచేస్తారని అనుకుందాం. మరి వైసీపీ తరపున ఎవరు పోటీచేస్తారు ?





ఇపుడిదే అధికారపార్టీకి పెద్ద సమస్యగా మారింది. రెండు ఎన్నికల్లో ఇద్దరిని పోటీలోకి దింపిన పార్టీ మూడో ఎన్నికలో మూడో అభ్యర్ధిని రంగంలోకి దింపుతుందేమో చూడాలి. ఎందుకంటే రెండుఎన్నికల్లోను పోటీచేసిన అభ్యర్ధులిద్దరు ఇపుడు అడ్రస్ లేరుకాబట్టి కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందే. ఈ నేపధ్యంలోనే దేవినేని అవినాష్, కొడాలి నాని, పార్ధసారధి పేర్లు వినబడుతున్నాయి. నాని అయితే గుడివాడ అసెంబ్లీని కాదని విజయవాడ పార్లమెంటుకు పోటీచేస్తారా అనేది అనుమానమే.





ఇక అవినాష్ గతంలో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన అనుభవముంది. ఇపుడు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి రెడీ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెబితే కాదనరని పార్టీవర్గాలంటున్నాయి. అలాగే పెనమలూరు ఎంఎల్ఏ పార్ధసారధిని కూడా ఎంపీగా పోటీచేయించే అవకాశముందంటున్నారు. అవినాష్ అయినా పార్ధసారధి అయినా ఆర్ధికంగా గట్టిస్ధితిలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బందుండదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడ ఎంపీగా వైసీపీ అభ్యర్ధినే గెలిపించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: