రాజకీయంగా క్లైమ్యాక్సుకు చేరుకుంటున్న చంద్రబాబునాయుడు తెలంగాణాలో అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో అభ్యర్ధులను దింపాలని డిసైడ్ చేయటమే చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారిపోయింది. గడచిన ఎనిమిదిన్నర ఏళ్ళుగా రాజకీయంగా తెలంగాణాలో టీడీపీ ఉనికిలో కూడా లేకుండాపోయింది. దాదాపు నేలమట్టమైపోయిన పార్టీకి పూర్వవైభవం సాధించాలని చంద్రబాబు అనుకున్నారు.





పార్టీకి పూర్వవైభవం ఎలా సాధ్యమని అనుకున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. గడచిన రెండేళ్ళల్లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీచేయటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. పోటీచేస్తే పరువుపోతుందన్న భయమే ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేట్లు చేసింది. అలాంటిది ఏకంగా 119 నియోజకవర్గాల్లో పోటీచేయాలని డిసైడ్ చేయటం మామూలు విషయంకాదు. రాబోయే ఎన్నికల్లో గెలుపుసంగతిని పక్కనపెట్టేసినా గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుంటే అదే చాలా గొప్పన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవని పార్టీకి అసలు పోటీ ఎందుకో అర్ధంకావటంలేదు. 





చంద్రబాబు చేయించుకున్న సర్వేలోనే ఓ 20 నియోజకవర్గాల్లో మాత్రం తలా 5 వేల తెచ్చుకునే కెపాసిటి ఉందని బయటపడింది. నిజానికి తెలంగాణా ఎన్నికల్లో ఏదో చేసేయాలన్నది చంద్రబాబు ఆలోచనకాదు. తమకున్న ఓట్లను బూచిగా చూపించుకుని బీజేపీతో పొత్తుపెట్టుకోవటమే టార్గెట్. తెలంగాణాలో పొత్తు ఆధారంగా  ఏపీలో కూడా  బీజేపీకి మిత్రపక్షంగా మారాలన్నది ఆలోచన. అయితే ఈ ఆలోచనను ఏపీలో తమ్ముళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే చంద్రబాబు ముందుకే వెళుతున్నట్లు అర్ధమవుతోంది.





రేపటి ఎన్నికల్లో అభ్యర్ధులకు వచ్చే ఓట్లను బట్టే ఏపీలో భవిష్యత్తు ఆధారపడుంది. తెలంగాణాలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోతే దీని ప్రభావం ఏపీ ఎన్నికల్లో పడటం ఖాయం. అంటే తెలంగాణాలో జరగబోయే పరీక్ష చంద్రబాబుకు సెమీఫైనల్ లాంటిదనే అనుకోవాలి. సెమీఫైనల్  రిజల్టులో  పర్వాలేదన్నట్లుగా ఉంటే ఫైనల్ కు రెడీ అవుతారు. సెమీఫైనల్లోనే పరిస్ధితి ఘోరంగా ఉంటే మాత్రం ఫైనల్ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: