కల్వకుంట్ల కవిత, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మధ్య టామ్ అండ్ జెర్రీ షో దాదాపు క్లైమ్యాక్స్ కు వచ్చేసినట్లుంది.  కవితను ఎలాగైనా సరే విచారణకు రప్పించాల్సిందే అని ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా సరే విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారు. తన ప్రయత్నాల్లో భాగంగా కవిత సుప్రింకోర్టులో కేసు వేశారు. నిజానికి మొన్నటి 16వ తేదీనే విచారణకు హాజరవ్వాల్సుంది.





అయితే 16వ తేదీ ఉదయం వరకు ఏమీ మాట్లాడని కవిత మధ్యాహ్నానికి తాను విచారణకు హాజరుకాలేనంటు కబురుచేశారు. 11వ తేదీ విచారణలో భాగంగా ఈడీ అడిగిన డాక్యుమెంట్ల, ప్రశ్నలకు సమాధానాలను రాతమూలకంగా తన ప్రతినిధి ద్వారా పంపారు. దాంతో మండిపోయిన ఈడీ వెంటనే అలా కుదరదని చెప్పి 20వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే అని కచ్చితంగా మరో నోటీసులో చెప్పింది. దాంతో వెంటనే కవిత కోర్టులో పిటీషన్ వేశారు.





ఈడీ విచారణలో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతు, ఈడీనే తనింటికి విచారణకు వచ్చేట్లుగా ఆదేశాలివ్వాలని కవిత కోర్టులో పిటీషన్ వేశారు. దాన్ని ఈనెల 24వ తేదీన విచారిస్తానని కోర్టు చెప్పింది. తాజా డెవలప్మెంట్లతో తన కేసును 20వ తేదీలోగానే విచారించాలని కవిత శుక్రవారం మరో అత్యవసర పిటీషన్ను వేస్తే దాన్ని కోర్టు కొట్టేసింది. పిటీషన్ లో అంత అత్యవసరమేమీ లేదని 24వ తేదీనే విచారిస్తామని తేల్చేసింది.





దాంతో ఇపుడు కవిత 20వ తేదీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. హాజరుకాకపోతే కవితకు వ్యతిరేకంగా ఈడీ కోర్టులో పిటీషన్ వేసే అవకాశముంది. కోర్టు గనుక సానుకూలంగా స్పందిస్తే కవితను ఈడీ వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా కవిత విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమో అనే భయం వెంటాడుతోందట. అరెస్టు భయంతోనే  కవిత విచారణకు హాజరుకావటంలేదనే ప్రచారం పెరిగిపోతోంది. అంటే ఇపుడు బాల్ ఈడీ చేతిలోకి వెళ్ళింది. మరి ఈడీ ఏమిచేస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: