ఏపీ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారా ? అలాగనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే రాష్ట్ర బీజేపీ రెండురోజుల సమావేశాలు ముగిశాయి. మొదటిరోజు పదాదికారుల సమావేశం జరగ్గా రెండోరోజు కోర్ కమిటి సభ్యుల మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పొత్తులపై చర్చ జరిగినపుడు నేతల్లో రెండు రకాల అభిప్రాయాలు బయటపడ్డాయి. కొందరేమో పార్టీ ఒంటరిగానే పోటీచేయాలని సూచించారట. మరికొందరేమో టీడీపీ+జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చెప్పారట. దీంతో ఎన్నికల్లో పోటీచేసే విషయమై నేతలు రెండురకాలుగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది.
ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీలో మొదటినుండి పనిచేస్తున్న నేతలేమో ఒంటరిగా పోటీచేస్తే కానీ పార్టీ ఎదుగుదల సాధ్యంకాదని గట్టిగానే వాదించారట. పొత్తుల వల్ల నాలుగు సీట్లొచ్చినా ఓట్ల శాతం మాత్రం ఎప్పటికి పెరగదని స్పష్టంగా చెప్పారట. ఒంటరిపోటీ అయితే అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయవచ్చని, అదే పొత్తులో వెళితే కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పార్టీ పరిమితమైపోతుందన్నది పాత కమలనాదుల ఆందోళన. పార్టీ ఎప్పుడైతే కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతుందో మిగిలిన నియోజకవర్గాల్లో ఓటర్లు పార్టీకి దూరమైపోతారనే ఆందోళన వ్యక్తంచేశారట.
అయితే మరికొందరు నేతలు మాత్రం పార్టీకి సీట్లుంటేనే బతుకుంటుందని గట్టిగా వాదించారట. పార్టీకి ఓట్లతో పాటు సీట్లు కూడా ముఖ్యమేనని కాబట్టి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని గట్టిగా వాదించారని సమాచారం. ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతల్లో ఎక్కువమంది ఈ వాదనను వినిపించారని కమలనాదులు చెబుతున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, దగ్గుబాటి పురందేశ్వరి లాంటి వాళ్ళు టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకోవాల్సిందే అని గట్టిగా చెబుతున్నట్లు ప్రచారంలో ఉంది.
ఇక్కడ విషయం ఏమిటంటే జనసేన తమకు మిత్రపక్షమే అని పురందేశ్వరి పదేపదే ప్రకటిస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే నిజంగానే బీజేపీకి జనసేన మిత్రపక్షమే అయితే పురందేశ్వరి ఇన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరమే లేదు. అలాగే టీడీపీ తమకు మిత్రపక్షమని జనసేన అధినేత పవన్ చెబుతున్నారే కానీ పొరబాటున కూడా బీజేపీ మిత్రపక్షమని చెప్పటంలేదు. మొత్తానికి టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు రెండుగా చీలిపోయినట్లు అర్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి