తమ పార్టీలోని నేతలతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకటే మాట చెబుతున్నారు. అదేమిటంటే త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, పోటీచేసేందుకు అవకాశం రాని నేతలకు అధికారంలోకి రాగానే సముచిత స్ధానం కల్పిస్తామని.  పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టికెట్లు రాని నేతలు అభ్యర్ధుల గెలుపుకోసం పనిచేయాలని.  విశాఖపట్నం పర్యటనలో జనసేన అధినేత పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఓ 40 మంది నేతలతో భేటీ అయ్యారు.





ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కని నేతలు బాధపడద్దని చెప్పారు. పొత్తులో ఎన్నిసీట్లు వస్తాయో ? ఏ నియోజకవర్గాలు వస్తాయో కూడా తెలీదన్నారు. పోటీకి అవకాశం దొరకని నేతలు బాధపడకుండా కూటమి అభ్యర్ధుల గెలుపుకు పనిచేయాలన్నారు. పోటీకి జనసేన అనుకుంటున్న సీట్లు దక్కకపోవచ్చని  పవన్ హింట్ ఇచ్చారు. ఇందుకు రాజమండ్రి, పెందుర్తి నియోజకవర్గాలను ఉదాహరణగా చెప్పారు. పెందుర్తిలో టీడీపీ తరపున పోటీచేయాలని బండారు సత్యనారాయణమూర్తి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెప్పారు.





ఈ రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలని తాను అడిగినట్లు, ప్రయత్నిస్తున్నట్లు పవన్ చెప్పారు. అయితే చివరి నిముషంలో పై రెండు నియోజకవర్గాలను వదులుకోవాల్సి  రావచ్చని కూడా అన్నారు. అంటే  పెందుర్తిలో పంచకర్ల రమేష్, రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ కు మొండిచెయ్యేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడ విషయం ఏమిటంటే రెండురోజుల క్రితం టెలికాన్ఫరెన్సులో తమ్ముళ్ళతో మాట్లాడిన చంద్రబాబు కూడా అచ్చంగా ఇదే చెప్పారు.





తమ్ముళ్ళతో మాట్లాడిన చంద్రబాబు త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నిసీట్లలో, ఏ నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం టీడీపీకి దక్కుతుందో తెలీదన్నారు. పొత్తుల్లో సీట్లసర్దుబాటు కారణంగా టికెట్ దక్కని తమ్ముళ్ళు బాధపడద్దన్నారు. అధికారంలోకి రాగానే మంచి భవిష్యత్తును కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే చంద్రబాబు, పవన్ ఇద్దరూ తమ పార్టీ నేతలకు ఒకే విధమైన ఓదార్పు మాటలు మాట్లాడుతున్నారు. అంటే మరి త్యాగాలు చేసేది ఎవరు ? వీళ్ళు త్యాగాలు చేసిన నియోజకవర్గాల్లో పోటీచేయబోయేది ఎవరన్నది ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: