వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 28 వేల ఇళ్లు పాక్షికంగా… వాటిలో దాదాపు 11,500 ఇండ్ల వరకు పూర్తిగా దెబ్బతిని నేలమట్టం అయ్యాయని అంచనా వేసింది రాష్ట్ర యంత్రాంగం. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదిక అందించారు. ఈ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పూర్తిగా ఇల్లు ధ్వంసమైన బాధితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర హౌసింగ్ ఆఫీసర్లు గ్రామాల వారీగా కూలిన ఇళ్ల సమాచారాన్ని సేకరించారు. పూర్తిగా కూలిపోయిన నివాసాలను ఒక కేటగిరీలో, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లు మరో కేటగిరీలో, అలాగే వాగులు, చెరువుల వెంట ఉన్న ఇళ్ల వివరాలను ఇంకో కేటగిరీలో నమోదు చేసి నివేదిక రెడీ చేస్తున్నారు అధికారులు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు, ఆ బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదటి విడతలోనే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అయితే పాక్షికంగా దెబ్బ తిన్న వాళ్లకు ఆర్థిక సాయం చేయనున్నారని తెలుస్తుంది. ఇంటి స్థలం ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ కింద రూ. 5 లక్షలు, అలాగే స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్సష్టం చేసింది. అలాగే చెరువులు, కుంటల్లో నివాసాలు కూలిపోయిన బాధితులకు మరో ప్రాంతంలో భూములు కేటాయించనున్నారు. మూసీ పరివాహకంలో శాశ్వత నివాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 11 వేలకు పైగా కుటుంబాలు మూసీ పరివాహకంలో ఇళ్లు కట్టుకున్నాయని, వారికి తప్పుకండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు జత చేస్తూ వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. త్వరలో వదర బాధితులకు కూడా ఈ ఇళ్లను పంపిణీ చేయనుంది తెలంగాణ సర్కార్.