
తాజాగా నానికి అత్యంత సన్నిహితుడు, కృష్ణాజిల్లా వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్ అబూ తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు గెలిపించిన గుడివాడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నమ్మకద్రోహి కొడాలి నాని అంటూ అబూ తప్పుపట్టారు. నాని వైఖరితో విసిగిపోయిన తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించాడు.
నానిని నమ్మి గుడ్డిగా మోసపోయామని.. ఎన్నికల్లో ఓడిపోయాక మొత్తం పార్టీని గాలికి వదిలేశారని.. పార్టీనే నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడంలేదంటూ అబూ మండిపడ్డారు. కృష్ణ జిల్లాలో వరదలు ముంచెత్తినా బాధితులను పరామర్శించేందుకు కూడా నాని రాలేదంటూ విమర్శించారు. వరదల్లో నందివాడ మండలం ప్రజలు సర్వం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతుంటే అండగా ఉండాల్సిన నాని.. కనీసం కన్నెత్తి చూడలేదంటూ అబూ వాపోయారు.
అటువంటి క్లిష్ట సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు ఆయన అనుచరులే వరద బాధితులను ఆదుకున్నారని.. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలకు సేవ చేస్తూ రాము రాజకీయాలకే కొత్త అర్థం చెప్పారని అబూ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో సమయంలో కొడాలి నానిని నమ్మి రాముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెబుతున్నట్లు అబూ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల తర్వాత రాము అమెరికా పారిపోతాడంటూ నాని తమను తప్పుదారి పట్టించాడని.. కానీ ఇప్పుడు నాని ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదంటూ అబూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు అబూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ పరిణామంతో కొడాలి నానికి సొంత పార్టీ నుంచే సెగ మొదలైందన్న విషయం స్పష్టమైంది.