జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ సీట్లో ఉప ఎన్నికలు  జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇదే తరుణంలో హైదరాబాదులో పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే తన పార్లమెంటు పదవిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని బిజెపి ప్లాన్లు వేస్తోంది. మరి ఈ త్రిముఖ పోరులో గెలుపు తీరాలు ఎవరికి ఉంటాయి.. ఎవరు పోటీ చేయబోతున్నారో వివరాలు చూద్దాం.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునితను బరిలోకి దించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల సానుభూతి కలిసి వచ్చి గెలిచే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. అయితే కంటోన్మెంట్ బైపోల్ లో లాస్య నందిత మరణం తర్వాత బై ఎలక్షన్స్ వచ్చాయి. కానీ అక్కడ ఆమె సోదరిని బరిలోదించినా ఆమె ఓటమిపాలైంది. 

అక్కడ సెంటిమెంటు కలిసి రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సిట్యుయేషన్ జూబ్లీహిల్స్ లో కూడా రిపీట్ అయితే మరో సీటు చేజారి పోతుందని కేసీఆర్ దిగులు పడుతున్నారట. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులను గమనించి ఎవరిని దించాలి అనేది సర్వే చేయించి టికెట్ అందించబోతున్నారట. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రావుల శ్రీధర్ రెడ్డి, పువ్వాడ అజయ్ జూబ్లీహిల్స్ టికెట్ ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని అసెంబ్లీ నియోజకవర్గం లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ బోని కొట్టలేదు. కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం గణేష్ గెలుపుతో ఒక్క సీటు దక్కింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ సీటుపై హస్తం పార్టీ కసరత్తులు చేస్తోంది. ఎలాగైనా దక్కించుకోవాలని అనేక విధాల ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు ఆ టికెట్ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్, పిజెఆర్ కూతురు  విజయ రెడ్డి, షాహింఖురేషి, నవీన్ యాదవ్, రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే ఎన్నికపై బీజేపీ కూడా  తీవ్ర కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసే ఓడిన  దీపక్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అలాగే పార్టీ మహిళా నాయకురాలు కీర్తి రెడ్డి డాక్టర్ పద్మ వీరపనేని బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ తన కూతురు బండారు విజయలక్ష్మి పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా ఎంఐఎం కూడా ప్రతిసారి జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలని చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతుంది. మరి ఈసారి కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. మరి ఇందులో ఏ పార్టీ వ్యూహం ఫలించబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇందులో కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ ఎన్నికల్లో కాస్త గెలుపు తీరాలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: