విషయం ఏంటంటే, బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చాలా చిన్నది. అందుకే అక్కడ జరిగే సభకు కేవలం 500 మందికి మాత్రమే పాసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇక హెలిప్యాడ్ వద్దనైతే పరిస్థితి మరీ విచిత్రం. మాజీ సీఎంని కలిసేందుకు కేవలం 30 మందికే అవకాశం కల్పించారు. సాధారణంగా హెలిప్యాడ్ వద్ద వందలాది మంది నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికే దృశ్యాలకు భిన్నంగా, ఈసారి కేవలం ఓ లిస్ట్ ప్రకారం మాత్రమే అనుమతులు ఉండబోతున్నాయి.
ఆ 500 మందిలో కూడా బడా నేతల సంఖ్య యాభై దాటదు. మిగిలిన వారంతా కింది స్థాయి నాయకులు, వారి అనుచరులే. అంటే, సామాన్య జనం, అభిమానులు తమ నేతను చూసేందుకు కూడా వీల్లేని పరిస్థితిని కల్పిస్తున్నారు.
అధికారికంగా 500 మందికి అనుమతి ఇచ్చినా, మాజీ సీఎం వస్తున్నారంటే వేలాదిగా తరలివచ్చే అభిమానుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎవరి తరం. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు, అభివాదం చేసేందుకు వచ్చే జనసంద్రానికి ఈ సంఖ్యాపరమైన ఆంక్షలు ఏమాత్రం సరిపోతాయో అధికారులకే తెలియాలి. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం మధ్య ఉన్న రెండు కిలోమీటర్ల దారిలో ప్రజలు రోడ్లపైకి రాకుండా, సీఎం కాన్వాయ్‌కు చేతులు ఊపకుండా నిలువరించడం అనేది ఆచరణలో అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదే తరహా ఆంక్షలను గతంలో ప్రతిపక్ష నేతల పర్యటనలకు విధిస్తే, వాళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అది అహంకారమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని గర్జించిన నేతలే, ఇప్పుడు అవే నిబంధనలను "ప్రజల భద్రత, బాధ్యత" పేరుతో అమలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆనాడు ప్రభుత్వ చర్యలను అరాచకమన్న వారు, ఈనాడు తాము చేస్తున్నది బాధ్యతాయుతమైన పని అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడికి పటిష్టమైన సెక్యూరిటీ కల్పించాల్సిన ప్రభుత్వం, ఇలా జనం రాకుండా కట్టడి చేయడం సరైన విధానమేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిబంధనల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలు ఏమిటో, ఈ పర్యటన ఎలా సాగుతుందో చూడాలి. మాజీ సీఎం పర్యటన అంటే ప్రజాఉద్యమంలా సాగాలి కానీ, ఇలా కర్ఫ్యూ వాతావరణంలో జరగడం ఎంతవరకు సమంజసమో కాలమే సమాధానం చెప్పాలి.