
ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న నిరసనల మధ్య, షెడ్యూల్‌ను విడుదల చేయడం ఎన్నికల కమిషన్‌పై మరింత దృష్టి సారింపజేసింది. బీహార్‌లో ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారని అధికారులు ముందుగానే వెల్లడించారు.ఇక ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాపై కూడా పెద్ద వివాదం చెలరేగింది. ఈ జాబితాలో చేర్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించాలని న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీనివల్ల కొత్త సందేహాలు ఉత్పన్నమయ్యాయి.తుది జాబితాలో ఓటు హక్కు కోల్పోయిన వారి హక్కులు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారి గుర్తింపులు తదితర అంశాలపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు.
అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బీహార్‌లో వయోజన జనాభా 8.2 కోట్లు ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, సుమారు 10 శాతం మంది ఓటు హక్కు కోల్పోయినట్లుగా తేలింది. దేశ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి ఒకే రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు జాబితా నుంచి తొలగించబడటం రికార్డ్‌గా నిలిచింది. ముఖ్యంగా, ఓటు హక్కు కోల్పోయిన వారిలో 34 శాతం మంది ముస్లింలు ఉండటం ఇప్పుడు ఎన్నికలపై కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. మొత్తం మీద సుమారు ఆరు లక్షల మంది ముస్లింలు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డారని వార్తలు చెబుతున్నాయి. ఇది నిజాయితీగా జరిగిందా? లేక అధికార పార్టీ ప్రతిపక్షాన్ని బలహీనపరచే ప్రయత్నమా? అనే చర్చలు జరుగుతున్నాయి.
అదే సమయంలో, మహిళా ఓటర్ల పేర్లు కూడా పెద్ద సంఖ్యలో జాబితాలో లేకపోవడం మరో ఆందోళనకర అంశంగా మారింది. దీంతో బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది..!