ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ప్రతి రోజు పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, పార్టీ ఆఫీస్ బేరర్‌తో కలిసి గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని ఆదేశించినా, అది గత కొద్ది నెలలుగా నిలిచిపోయిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించకపోవడం వల్లే ప్రజలు తమ సమస్యలతో నేరుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి, గ్రీవెన్స్ నిర్వహణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలు, ఎమ్మెల్యేలు తగిన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రతి ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారో, ఎన్ని సమస్యలు పరిష్కరించారో వివరాల నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
సమావేశంలో లోకేశ్ పలు నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తగిన రీతిలో స్పందించలేదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి ఫరూక్ వ్యవహారాలపై కూడా ఆయన పరోక్షంగా అసంతృప్తి తెలిపినట్లు సమాచారం. అలాగే సీనియర్ నాయకుడు కొనకళ్ల నారాయణ వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టు అంశంపై సరిగ్గా స్పందించలేదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి, లోకేశ్ ప్రజాదర్బార్ ప్రజాభిమానాన్ని చాటుతూనే, పార్టీ నేతల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. ఇకపై గ్రీవెన్స్ కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రతి నాయకుడి పనితీరును మానిటర్ చేయాలనే నిర్ణయంతో లోకేశ్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి