వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ–జనసేన నేతలు కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ… గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై అబద్ధాల దుష్ప్రచారం చేస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జగన్ ఘాటు విమర్శలు చేశారు. “అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా టీడీపీ–జనసేన ఒకే పాట పాడుతున్నాయి. వైయస్సార్‌సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, పరిశ్రమలు పారిపోయాయని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి వెళ్లారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు” అంటూ ఆయన మండిపడ్డారు.


ఈ ఆరోపణలకు గణాంకాలతోనే కౌంటర్ ఇచ్చారు జగన్. “ఒకవేళ నిజంగానే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు క్షీణించి ఉంటే… తయారీ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర పనితీరు అత్యంత దారుణంగా ఉండాలి. కానీ, తాజా అధికారిక గణాంకాలు పూర్తి భిన్నమైన నిజాన్ని చెబుతున్నాయి” అంటూ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన డేటాను ప్రస్తావించారు. ఆర్‌బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం… 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఉత్పత్తి (మాన్యుఫాక్చరింగ్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని జగన్ గుర్తు చేశారు. అంతేకాదు… యావత్ భారతదేశంలోనే 5వ స్థానాన్ని సంపాదించిందని స్పష్టం చేశారు. ఇది కేవలం మాటలు కాదు… దేశంలోని అగ్ర ఆర్థిక సంస్థ ఇచ్చిన అధికారిక నివేదిక అని ఆయన తేల్చి చెప్పారు.



ఇక పారిశ్రామిక రంగం మొత్తంగా చూసినా… 2019–24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత్‌లో నంబర్ వన్‌గా, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచిందని జగన్ వివరించారు. “ఇదేనా బ్రాండ్ ఏపీ నాశనం అంటే? లేక సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం ఆర్థికంగా ఎదిగిందని చెప్పాలా?” అంటూ ఆయన ప్రశ్నించారు. చివరగా తన ట్వీట్‌ను “సత్యమేవ జయతే” అనే పదాలతో ముగించారు. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం గత పాలనను తప్పుబడుతుంటే… మరోవైపు జగన్ గణాంకాలతోనే సమాధానం ఇవ్వడం విశేషంగా మారింది. ముఖ్యంగా ఆర్‌బీఐ లాంటి విశ్వసనీయ సంస్థ గణాంకాలను ఆధారంగా చూపించడం… వైయస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి… “అబద్ధాల ప్రచారమా? లేక వాస్తవాల రాజకీయమా?” అనే డిబేట్‌ను జగన్ ట్వీట్ మళ్లీ తెరపైకి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: