ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పైకి కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకూ విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ… ఈ నిర్ణయం వెనుక మరో లోతైన కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలోనే కేంద్రం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆరావళిలోని 90 శాతం ప్రాంతం పర్వతాలు కావని, కేవలం కొండలేనని నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు అసలు అగ్నిపరీక్షగా మారింది.


100 మీటర్లు దాటితేనే పర్వతమా? .. ఆరావళికి కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలను షాక్‌కు గురి చేసింది. స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (సుమారు 328 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భూభాగాన్ని మాత్రమే “ఆరావళి పర్వతం”గా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల్లోనే మైనింగ్ నిషేధం వర్తిస్తుందన్నది అసలు ట్విస్ట్. వాస్తవానికి ఆరావళి శ్రేణిలోని దాదాపు 91 శాతం కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. అంటే… చట్టపరంగా అవన్నీ మైనింగ్‌కు ఓపెన్ అయ్యే ప్రమాదం! ఇదే అంశాన్ని మైనింగ్ మాఫియా అవకాశంగా మార్చుకుంటుందన్న భయాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి లూప్ హోల్ దొరికిందంటే… తవ్వకాలు ఆపడం అసాధ్యమన్నది దేశ చరిత్రే చెబుతోంది. ఆరావళి పర్వతాలు కేవలం కొండలు కావు… అపారమైన ఖనిజ సంపదకు నిలయాలు. ప్రపంచ ప్రఖ్యాత మక్రానా పాలరాయి ఇక్కడిదే – అదే తాజ్ మహల్ నిర్మాణానికి ఉపయోగించారు.

 

అంతేకాదు, గ్రానైట్, సీసం, జింక్, రాగి, వెండి వంటి లోహ ఖనిజాలు, ఫెల్డ్‌స్పార్, క్వార్ట్జ్ వంటి అలోహ ఖనిజాలు ఇక్కడ విస్తారంగా లభిస్తాయి. వీటి నాణ్యత, రసాయన మిశ్రమం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. అందుకే మైనింగ్ మాఫియా కన్ను ఎప్పుడూ ఆరావళిపైనే! సేవ్ ఆరావళి – పోరాటం ఊపందుకుంది .. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా ‘సేవ్ ఆరావళి’ ఉద్యమం ఊపందుకుంది. సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుని కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. కానీ… ఆరావళి నిర్వచనంపై తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా నిలిపివేయలేదు. పర్యావరణ నిపుణుల హెచ్చరిక స్పష్టం – చిన్న కొండలను వదిలేస్తే థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది, ఉత్తర భారతదేశం భయంకర పర్యావరణ విపత్తును ఎదుర్కొంటుంది. మైనింగ్ అంటేనే స్కాంలకు మారుపేరు అయిన మన దేశంలో… ఉత్తర్వులతోనే ఆరావళి కాపాడబడుతుందా? ఒకసారి లూప్ హోల్ ఇచ్చాక నిజంగా పర్వతాలను రక్షించగలమా? ఇదే ఇప్పుడు దేశమంతా అడుగుతున్న అసలు ప్రశ్న!

మరింత సమాచారం తెలుసుకోండి: