హైదరాబాద్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే… రాజీనామా ప్రకటన ఇక టైమ్ మాత్రమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు వందల డివిజన్లలో కాంగ్రెస్–ఎంఐఎం కలిపి అత్యధిక స్థానాలు గెలుస్తాయని చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు… “నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను” అని బహిరంగంగా ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.


గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ … 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన రాజకీయ స్థానం మీదే చర్చ నడుస్తోంది. దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనర్హత పిటీషన్ దాఖలు చేసింది. ఆ పిటీషన్ ఆధారంగా ఆయనపై వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతున్న సమయంలో… దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కీలకంగా మారాయి. తాను బీఆర్ఎస్ కాదని, పూర్తిగా కాంగ్రెస్ నేతనేనని స్పష్టం చేయడం ద్వారా అనర్హత అంశాన్ని కూడా ఒక రకంగా పక్కకు నెట్టినట్లయ్యింది.



మూడు వందల డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించడం ద్వారా… తాను ఇక కాంగ్రెస్ రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్ అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కలిపి చూస్తే… రాజీనామాకు సిద్ధమేనన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఫారంపై పోటీ చేసిన దానం నాగేందర్‌పై స్పీకర్ వేటు వేయకముందే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి పార్టీ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే అనర్హత పిటీషన్‌పై స్పీకర్‌కు ఇప్పటివరకు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదని సమాచారం.



రాజీనామా చేయబోతున్నప్పుడు వివరణ ఎందుకన్న భావనతోనే స్పీకర్‌కు ఎలాంటి లేఖ రాయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే… ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం. రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సిందే. ఇప్పటికే రాజకీయ వేడితో ఉడికిపోతున్న హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దానం నాగేందర్ రాజీనామా ఎప్పుడు అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. మరికొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం బయటకు వస్తుందని బలమైన ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరగడం మాత్రం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: