కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అమలును చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా పెన్షన్ పంపిణీలో తేడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లాలకు వెళ్లి, పేదల ఇళ్ల ముంగిటే పెన్షన్లు అందజేస్తూ… “ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, నైతిక కర్తవ్యమూ” అన్న సందేశాన్ని గట్టిగా ఇస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లాగే సామాజిక పెన్షన్లు కూడా కచ్చితంగా అందుతున్నాయి. అంటే చేతిలో నగదు ఠంచనుగా పేదల చేతికి చేరుతోందన్న మాట. ఇదే క్రమాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం మరింత నిబద్ధతతో ముందుకు సాగుతోంది.


ఒక రోజు ముందే పెన్షన్… పేదలకు ఊరట :
2026 జనవరి 1న సెలవుదినం కావడంతో, సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1కి బదులుగా, ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 31నే పెన్షన్లు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. “పేదలు, వృద్ధులు, వికలాంగులు ఎవరూ ఇబ్బంది పడకూడదు అన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా డిసెంబర్ 31న పెన్షన్ తీసుకోలేకపోతే, వారికి జనవరి 2న తప్పకుండా అందిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు.



ఇంటి వద్దకే నగదు… అదే ఎన్టీఆర్ భరోసా :
ఎప్పటిలాగే ఈసారి కూడా సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 63.12 లక్షల మంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ నెలకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం ప్రతీ నెలా రూ.2,743.99 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఏడాదికి ఈ మొత్తం ఏకంగా రూ.33 వేల కోట్లకు పైమాటే. ఇంత భారీ వ్యయం అయినప్పటికీ, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు… “ఎంత కష్టమైనా పెన్షన్లు ఆగకూడదు” అన్న నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.



దేశంలోనే గ్రేట్ మోడల్ :
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, వాటిని పక్కనపెట్టి సామాజిక పెన్షన్లకే తొలి ప్రాధాన్యత ఇస్తోంది కూటమి ప్రభుత్వం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నెలకు రూ.4,000 సామాజిక పెన్షన్ అందించడం నిజంగా ఒక గ్రేట్ మోడల్ అని రాజకీయ, ఆర్థిక వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఎన్టీఆర్ భరోసా పేరుకు తగ్గట్టుగానే… పేదల జీవితాల్లో నిజమైన భరోసాగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: