భక్తులు ప్రధానంగా దర్శించుకునే గద్దె చుట్టూ 8 ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి, గద్దెల మధ్యలో వెదురు ఆకృతులను ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా రూపకల్పన చేశారు. ఈ ప్రాంగణంలో దాదాపు 7,000 శిల్పాలు కొయ్య తెగ సంస్కృతి, వారి వంశావళిని కళ్లకు కట్టేలా చూపిస్తాయి. ప్రాకార గోడలపై కొయ్యల చరిత్రను తెలిపే చిహ్నాలు, ఘట్టాలను చెక్కుతున్నారు. ప్రధాన ద్వారం వద్దనే సమ్మక్క వంశానికి చెందిన 59 శిల్పాలను ప్రతిష్టించగా… మొత్తం 7,000 శిల్పాలు సుమారు 750 కొయ్య వంశాల పేర్లను ప్రతిబింబించేలా రూపొందుతున్నాయి. దీంతో ఈ ప్రాంగణం ఒక సజీవ ఆదివాసీ విజ్ఞాన కేంద్రంగా మారుతోంది. భారీ తోరణాలు… కళకు ప్రతీక .. మేడారం ఆలయానికి శోభనిచ్చేలా వివిధ పరిమాణాల్లో భారీ తోరణాలను నిర్మిస్తున్నారు. ఇందులో 50 అడుగుల ఎత్తు గల ఒక ప్రధాన తోరణం, 40 అడుగుల ఎత్తు ఉన్న మూడు తోరణాలు, 30 అడుగుల ఎత్తు ఉన్న ఐదు తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ తోరణాలు భక్తులకు స్వాగతం పలుకుతూ… కాకతీయ శైలి, ఆదివాసీ నిర్మాణ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రాచీనతకు భంగం కలగకుండా అభివృద్ధి .. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో 250 మంది నిపుణులైన శిల్పులు చెక్కుతున్నారు. ప్రముఖ పురావస్తు నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. రూపకల్పన, డాక్యుమెంటేషన్‌లో 15 మంది ఆర్కియాలజీ విద్యార్థులు పాల్గొంటూ… ప్రాచీనత దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని విస్మరించకుండా, ప్రాంగణంలోని పాత చెట్లను అలాగే సంరక్షిస్తున్నారు. అదనంగా 12 రకాల పవిత్ర అటవీ వృక్షాలు, 140 రకాల ఔషధ మొక్కలను నాటుతూ పవిత్ర వనాన్ని రూపొందిస్తున్నారు.ఈ పునర్నిర్మాణం పూర్తయితే… మేడారం కేవలం ఒక జాతర ప్రదేశంగా కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందుతుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉంది. సమ్మక్క–సారలమ్మ గడ్డ… ఇప్పుడు గ్లోబల్ గుర్తింపుకు సిద్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి