_ బలవర్ధకమైన ఆహారం ఏర్పాటు
_ మనుషుల కంటే ఎక్కువ సపర్యలు
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
సంక్రాంతి పండుగ వస్తుందంటే కో అంటే కోడి, కో అంటే కోటి అనిపించేలా కోడి పందాల సంబరాలు ప్రస్తుత ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలలో నిర్వహిస్తారని దేశం నలుమూలలతో పాటు ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చెందింది. గత ఏడాది తాడేపల్లిగూడెం సమీపంలో ఒక బిరిలో అక్షరాల కోటి రూపాయల పందెం నిర్వహించడమే దీనికి తార్కాణం అని చెప్పుకోవాలి. సంక్రాంతి సమయంలో జరిగే కోడిపందాల బిరులలో అత్యల్పం రెండు లక్షల నుండి అధికంగా 20 లక్షల వరకు ఒప్పంద పందాలు జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి భిన్నంగా గత ఏడాది 50 లక్షలు కోటి రూపాయలు పందాలు కూడా జరిగాయంటే కోడిపందాల పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఉన్న అభిమానం ఎటువంటిదో చెప్పకనే చెప్పవచ్చు. అరగంటలో ఫలితం తేలే ఇటువంటి కోడిపందాలు బిరులలో ఈ విధంగా ఒప్పంద పందాలు జరిగితే బిరి బయట అంతకు రెట్టింపు పందాలు జరుగుతాయనేది వాస్తవంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కోడిపందాలకు ఈ ప్రాంతాలలో ఇప్పటికే బిరులు సిద్ధం అవుతున్నాయి. ఇతర ప్రాంతాలనుండి వీక్షించటానికి పందాలు కాయటానికి వచ్చే అతిధులు స్నేహితులు ఉండేందుకు వారి స్థాయిలలో కాటేజీలు రూములు ఇప్పటికే పట్టణాల్లో సిద్ధం చేశారంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో జరిగే కోడిపందాలకు రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సినీ నటులు సైతం ఎంతో మక్కువతో,ముచ్చటగా హాజరవుతారంటే కోడిపందాలకు ఉన్న క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
కోళ్లను ఈత కొట్టించటం:
పందాలలో పాల్గొనే కోళ్లను ఎంతో మక్కువతో పెంచుతూ ఉంటారు అందులో భాగంగానే ప్రత్యర్థి కోడి పై సత్తా చాటి గెలుపొందడం కోసం కోళ్లకు అనేక తర్ఫీదులను ఇస్తారు. అందులో ముఖ్యంగా ఈత కొట్టించడం అని చెప్పాలి. ఈత కొట్టించే ప్రక్రియలో కోళ్లను పెంచే మకాముల వద్ద చిన్నపాటి డ్రమ్ములను ఏర్పాటు చేస్తారు ఇందులో ఉదయాన్నే కోళ్లను ఈత కొట్టిస్తారు. ఇలా ఈత కొట్టించడం ద్వారా ప్రత్యర్థి కోడిపై తన జులుం ప్రదర్శించడానికి సాలి, ఒగుర్పు, అలసిపోవటం వంటివి రాకుండా పోరాటం చేస్తుందని పందెం రాయుళ్లు పేర్కొంటున్నారు. ఈత కొట్టి అలసిపోయిన కోళ్లకు పెనంపై కాటన్ వస్త్రాలను వేడి చేసి కోళ్లకు అద్ది ఉపశమనం పొందేలా చేస్తారు. ఇలా కోళ్లకు చేసే ప్రక్రియను ఎవరితో పడితే వారితో చేపించకుండా ట్రైనింగ్ పొందిన వారితోనే చేయించడం విశేషం.
బలవర్ధకమైన ఆహారం ఏర్పాటు:
పందాలలో పాల్గొనే కోళ్లకు బలవర్ధకమైన ఆహారం ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా మటన్ కైమా, జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు వంటి వాటితో లడ్డూలు తయారు చేసి కోళ్లకు దాణాగా పెడుతూ ఉంటారు. ఇలా బలవర్ధకమైన తిన్న కోడి పోట్లాటలో ముందు ఉండటమే కాకుండా అత్యంత పదునుగా ఉండే కోడి కత్తి ఘాటు కూడా కోడి శరీరంలో దిగకుండా శరీరం గట్టిపడుతుందని మకాంధారులు తెలుపుతున్నారు. అందుకే అత్యంత ధర కలిగిన వేటమాంసం మరియు డ్రై ఫ్రూట్స్ తో తయారుచేసిన ఆహార పదార్థాలను నిర్దేశించిన సమయం ప్రకారం పెట్టి పోషిస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
మనుషుల కంటే ఎక్కువ సపర్యలు:
కోడిపందాలలో పాల్గొనే కోడి మకాములలో పెంచే కోళ్లకు మనుషుల కంటే ఎక్కువ సఫర్యలు చేస్తారంటే మనమంతా నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ మకాముల లోపలకు అందరికీ అనుమతులు ఇవ్వరు. అలాగే మకాము లోపలికి వాళ్లను చూడటానికి వెళ్లే వారిని సైతం పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు. అలాగే ఈ కోళ్లను చిన్నపిల్లల కంటే ఎక్కువగా సాకుతారు. ఎందుకంటే ఎటువంటి వైరస్లు దరి చేరినా అది మకాము మొత్తానికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. తాము పెంచిన కోడి పందెం బిరులో ప్రత్యర్థి కోడి పై గెలుపొందాలని ఉవిళ్ళూరే పందెం రాయుళ్లు పందెం పుంజుల పెంపకానికి వెనకాడరని చెప్పాలి.
కొసమెరుపు ఏమిటంటే పేరెన్నిక కలిగిన మఖాముల నుండి పెంపకం దారుల నుండి కోడి బరిలోకి దిగుతుందంటే గెలుపు దీమా వ్యక్తం చేస్తూ లక్షల రూపాయలను పైసాగా పందాలలో కాస్తారు. సంక్రాంతి పండగ కోసం పందెం రాయుళ్లు ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న సమయం మరి కొన్ని రోజులలో రానే వస్తుంది. కోట్ల రూపాయలు కోడిపందాల రూపంలో చేతులు మారనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి