తెలంగాణ కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేయగా..తాజాగా మ‌రో ఎమ్మెల్యే సైతం గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ప‌లువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపినట్టుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ...కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. . టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయే అని పేర్కొన్నారు.

 

 

నల్గొండలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని తెలిపారు. ఉత్తమ్, కుంతియా వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  టీడీపీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అన్నారు.

 

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనపడిందని నాయకులు భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారని రాజ్‌గోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకునే అవకాశం లేకపోవడంతోనే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒర‌వ‌డిలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు అర్ధమవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరినట్ల అయిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: