తెలంగాణ లో త్వరలోనే పురపాలక ఎన్నికలు జరగనుడడం తో అధికార టీఆరెస్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది . మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోన్న టీఆరెస్ , ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ ని టార్గెట్ చేస్తోంది . ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడాన్ని టీఆరెస్ నాయకత్వం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది . లోక్ సభ ఎన్నికల్లో జరిగిన పొరపాటే , మున్సిపల్ ఎన్నికల్లో పునరావృత్తం కాకుండా ముందు జాగ్రత్తగా బీజేపీ పై టీఆరెస్ మాటల దాడి  ప్రారంభించింది .


 బీజేపీ కూడా తామేమి తక్కువ తినలేదన్నట్లుగా టీఆరెస్ ను ప్రతి అంశంలోనూ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది . టీఆరెస్ కు రానున్న రోజుల్లో తామే ప్రత్యామ్నాయమని భావిస్తోన్న కమలనాధులు ఆ దిశగా ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి బలపడాలని చూస్తున్నారు . ఇక బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన అనంతరం బీజేపీ నాయకత్వం లో  కొత్త జోష్ కన్పిస్తోంది . అధికార టీఆరెస్ ఒక్కంటే ... మేము రెండు అంటాం అనే రీతిలో కౌంటర్ ఇస్తుండడం, టీఆరెస్ నాయకత్వాన్ని పునరాలోచనలో పడేసింది .


దానికి తోడు టీఆరెస్ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీ కి గుడ్ బై చెప్పడం, ఆయన బీజేపీ లో చేరే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపధ్యం లో బీజేపీ ని ఏమాత్రం తక్కువ అంచనా వేయవద్దని టీఆరెస్ నాయకత్వం భావిస్తోంది . పట్టణ ప్రాంతం లో బీజేపీ కి ఎంతో, కొంత పట్టుండడం , మోడీ చరిష్మా పని చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తోన్న టీఆరెస్ నాయకత్వం , ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: