గోవాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన 37వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైంది. అన్ని రాష్ర్టాల ఆర్థికశాఖ మంత్రులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించగా.. కొన్నింటిపై భారీగా పన్ను వడ్డించారు. సమావేశం అనంతరం నిర్మలాసీతారామన్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలన్నీ అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. హోటల్‌ గదుల అద్దెలపై పన్ను తగ్గించి ఆతిథ్య, పర్యాటక రంగాల్లో కొత్త జోష్‌ను నింపగా.. ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆటోమొబైల్‌, బిస్కెట్‌ తయారీ రంగాలకు మాత్రం నిరాశే మిగిలింది. చింతపండు, గ్రైండర్లు, రంగురాళ్లు, వజ్రాలపై పన్ను తగ్గింపు సామాన్యుడికి ఊరట కల్పించే అంశం. అదే సమయంలో కాఫీ, సోడా వంటి ‘కెఫినేటెడ్‌ బెవరేజెస్‌'పై పన్నును రెట్టింపునకు పైగా పెంచి బెదరగొట్టింది.


హోటల్‌ గదుల అద్దెలపై పన్నును భారీగా తగ్గించారు. అద్దె ఒక రాత్రికి రూ.వెయ్యిలోపు ఉంటే పన్ను ఉండదు. అద్దె రూ.7,500 వరకు వసూలు చేస్తే గతంలో 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించారు. రూ.7,500కు పైన అద్దె వసూలు చేస్తే గతంలో 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి కుదించారు. మ‌రోవైపు, ప్యాసింజర్‌ వాహనాలకు సంబంధించి గరిష్ఠంగా నాలుగు మీటర్ల పొడవు ఉండి, తొమ్మిది మంది ప్రయాణించగలిగే వాహనాలపై పరిహార పన్నును కాస్త తగ్గించారు. వీటిపై గతంలో 28 శాతం జీఎస్టీతోపాటు పరిహార పన్ను (కాంపన్షేషన్‌ సెస్‌) 15 శాతం ఉండేది. శుక్రవారం నాటి సమావేశంలో 1500 సీసీ సామర్థ్యం ఉన్న డీజిల్‌ వాహనాలపై పరిహార పన్నును మూడు శాతానికి, 1200 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్‌ వాహనాలపై పన్నును ఒక శాతానికి తగ్గించారు. ఇదే సామర్థ్యం, పొడవు ఉండి 10-13 మంది ప్రయాణించగలిగే వాహనాలకు సైతం ఈ తగ్గింపు వర్తించనున్నది. వాహనతయారీ రంగంపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు.  దేశంలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యాలు ఎలాంటి ఫ‌లితం ఇస్తాయో మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: