ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక వార్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతుండటంతో అందరి దృష్టి అంతా హుజూర్ నగర్ మీదే పడింది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ హుజూర్ నగర్ ని కైవసం చేసుకుని సత్తా చాటాలని చూస్తుండగా...మరోవైపు తమ కంచుకోటని మరొకసారి సొంతం చేసుకుని పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అటు టీడీపీ,బీజేపీలు కూడా ఎంతోకొంత ఆ రెండు పార్టీలకి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి.


ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారం బరిలో దిగాయి. టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డిని గెలిపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఊరూరు తిరుగుతూ ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కేసీఆర్, కేటీఆర్ లు కూడా త్వరలోనే ప్రచార బరిలో దిగనున్నారు. ఇక తన భార్య పద్మావతిని గెలిపించుకునేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు సైతం హుజూర్ నగర్ లో తిష్ట వేశారు. అటు బీజేపీ నేతలు కూడా హుజూర్ నగర్ లో ప్రచారం చేస్తున్నారు.


ఇక టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయి తరుపున రాష్ట్ర టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే రాష్ట్ర నేతలు టీడీపీ అధినేత చేత ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా ప్రచారానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన హుజూర్ నగర్ ప్రచార బరిలో ఉండే అవకాశముంది. అయితే చంద్రబాబు ప్రచారానికొస్తే...అధికార టీఆర్ఎస్ కు మంచి అవకాశం దక్కినట్లే. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే కాంగ్రెస్ తో జత కట్టి ఎన్నికలకు వెళ్లడం టీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది.


ఏపీ నేతకు తెలంగాణలో పని ఏంటని ప్రశ్నిస్తూనే..కూటమి గెలిస్తే చంద్రబాబు మళ్ళీ మన మీద పెత్తనం చేస్తాడని కేసీఆర్ ప్రచారం చేశారు. ఆ ప్రచారం టీఆర్ఎస్ కు బాగా అడ్వాంటేజ్ అయింది. దాంతో ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చేశారు. ఇప్పుడు బాబు హుజూర్ నగర్ ప్రచారానికొచ్చిన అది టీఆర్ఎస్ కే కలిసొచ్చే అవకాశముంది. చూడాలి మరి చంద్రబాబు ప్రచారానికి వెళితే ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: