శశికళ టైమ్ ఏమాత్రం బాగా లేనట్టుంది. దెబ్బ మీద దెబ్బ వరుస దెబ్బలు తగులుతున్నాయి. నిన్ననే నాలుగేళ్లపాటు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి కోర్టు తీర్పులు వచ్చినప్పుడు శిక్ష పడిన వారు దాన్ని కొంతకాలమైనా తప్పుకునేందుకు సాకులు వెదుకుతారు. 


అలాంటి వారికి ముందుగా గుర్తొచ్చేది అనారోగ్యమే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కూడా అదే పని చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శశికళ లాయర్లు పిటీషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు శశికళను ఏమాత్రం కరుణించలేదు. 


శశికళ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం అంగీకరించేలేదు. శశికళ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. తీర్పులో ఎలాంటి మార్పులు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో ఇక శశికళ మరికొన్ని గంటల్లో జైలు ఊచలు లెక్కపెట్టక తప్పని పరిస్థితి. 


జయలలిత ఆదాయానికి మించిన కేసులో ఏ2గా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10కోట్ల జరిమాని విధించింది. శశికళ ఇప్పటికే గతంలో ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించి ఉంది. సో.. మరో మూడున్నరేళ్లపాటు శశికళ జైల్లో ఉండక తప్పదన్నాట. శశికళ విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి కోర్టులో లొంగిపోనుందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: