ఏపీలో గ్రామ వాలంటీర్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా గత కొన్ని రోజులుగా గ్రామ, వార్డు వాలంటీర్లపై విపక్ష నేతలు.. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన అత్యంత ఘోరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వీరికి అటు ప్రభుత్వం నుంచి.. ఇటు ప్రజల నుంచి మద్దతు లభించింది.  ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారి నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది.


ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వాలంటీర్లు అంటే జగన్ సైన్యం అని చెబుతూ.. వీరిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లడం. దీంతో వీరిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టడంతో పాటు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరి ద్వారా ప్రజలకు ఇంటివద్దకు చేరుతున్న పథకాలు పనులకు కూడా దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


తమపై గతంలో మానసికంగా ఎంతో ఇబ్బందులు పెట్టిన వారు.. తర్వాత జాబ్ సంతృప్తి కూడా లేకుండా విధులకు దూరం పెట్టడంతో వీరంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీనిపై ప్రజలు, వృద్ధుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో మేం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు నెలకు రూ.10వేల భృతి అందజేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తద్వారా వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


అయితే వీరంతా టీడీపీకి అనుకూలంగా మారతారా లేదా అంటే చెప్పడం కష్టం. దీంతో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని భావించిన వైసీపీ వీరందరి చేత రాజీనామాలు చేయించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఉసి గొల్పింది. సుమారు 66 వేల మంది వరకు రాజీనామాలు సమర్పించి వైసీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేయించి… టీడీపీని కూటమి నేతలను తిట్టిస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు రాజకీయ పార్టీలకు పావుగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: