అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి అత్యంత రహస్యంగా, సుమారు రెండు గంటల పాటు, కేసీఆర్ ఎర్రబెల్లితో ఏకాంతంగా సమావేశమయ్యారు. తనతో పాటు గన్ మేన్ ను సైతం తీసుకెళ్లకుండా ఎర్రబెల్లి ఒంటరిగా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. మెట్రో రైల్-ఎల్ అండ్ టీ లేఖలు-భూముల బదలాయింపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలు పెనుదుమారం రేపుతున్న నేపధ్యంలోనే, సీఎం కేసీఆర్ తెలంగాణలో టీడీపీ ముఖ్యనాయకుడైన ఎర్రబెల్లిని పిలిపించుకుని మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసీఆర్ కు సన్నిహితుడైన మైహోం రామేశ్వర్ రావుకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నదనీ... అందువల్లే మెట్రోరైల్ ప్రాజెక్ట్ సంక్షోభంలో పడిందని రేవంత్ ప్రభుత్వంపై తీవ్రఆరోపణలు చేస్తున్నారు. దీంతో, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సారి డిఫెన్స్ లో పడింది. మెట్రో ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని... దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేవలం మెట్రో రైల్ సంక్షోభంలో్ పడడానికి కారకులైన వ్యక్తలను మాత్రమే తాను టార్గెట్ చేస్తున్నాని... ఈ విషయంలో, సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకురావడం అనవసరమని... తప్పు ఎవరు చేసినా తప్పే అని రేవంత్ ఎర్రబెల్లికి ప్రతి సమాధానమిచ్చినట్టు సమాచారం. ఈ అంశంలో మిగతా టీడీపీ నాయకులు కూడా రేవంత్ కే తమ మద్దతు తెలిపారు. టీడీపీ లో ఈ లుకలుకల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ ఎర్రబెల్లిని కలవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మెట్రోరైల్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలను తెలుసుకోవడానికే కేసీఆర్ ఎర్రబెల్లిని పిలిపించుకుని మాట్లాడారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: