కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలన్నా, ప్రధానమంత్రి నరేంద్రమోడిని విమర్శించాలన్నా చంద్రబాబునాయుడు ఎంతగా భయపడిపోతున్నారనేందుకు తాజా ఉదాహరణ. అదేదో సినిమాలో ఓ కమెడియన్ తాను చెబుతున్న డైలాగులు ఎవరికీ అర్ధం అయ్యీ కానట్లే చెబుతుంటాడు. అదే పద్దతిలో చంద్రబాబు కూడా కొన్ని మాటలు చెప్పారు. అయితే అందులో ఒక్క ముక్క కూడా సూటిగా సుత్తిలేకుండా చెప్పలేకపోయారు. అంతా డొంక తిరుగుడు యవ్వారమే. మొన్నటి ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత కేంద్రం గురించి ఏమైనా మాట్లాడాలన్నా, మోడిపై విమర్శలు చేయాలంటే కూడా చంద్రబాబు భయపడిపోతున్నారు. వ్యతిరేకంగా ఏమి మాట్లాడితే ఏ కేసులు బయటకు తీస్తారో అనే భయంతోనే నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు.
ఇంతకీ నూతన వ్యవసాయ సంస్కరణల చట్టంపై చంద్రబాబు ఏమి చెప్పారంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టంపై జాతీయస్ధాయిలో చర్చ జరగలాట. ఆ చర్చలు కూడా రైతుకు మేలు జరగాలన్న సానుకూల ముగింపు కలిగుండాలన్నారు. కేంద్రప్రహభుత్వం, రైతులు, రైతు సంఘాలు ఏకాభిప్రాయం సాధించాలని చంద్రన్న పిలుపిచ్చారు. పాలకుల నిర్ణయాలు రైతు ప్రయోజనాలే మిన్నగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల్లోను, రైతు సంఘాల్లోను ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరిపి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రధానమంత్రికి సూచించారు.
పైనున్న ఐదారు లైన్లలో ఎక్కడైనా వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని కానీ లేదా నూతన వ్యవసాయ చట్టమే రైతులకు మేలు చేస్తుందని కానీ ఎక్కడైనా స్పష్టంగా ఉందా ? విచిత్రమేమిటంటే ఇదే వ్యవసాయ చట్టంపై పార్లమెంటులో చర్చలు జరిగినపుడు కేంద్రానికి టీడీపీ ఎంపిలు మద్దతుగా మాట్లాడారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టం వల్ల రైతాంగానికి మంచి జరుగుతుందంటు బ్రహ్మాండంగా పొగిడారు. మరిపుడు కూడా అదే విషయాన్ని నర్భయంగా చెప్పవచ్చు కదా. అలా చెబితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు ? ఇటు రైతుల దృష్టిలో చెడ్డ కాకూడదు. అలాగని అటు మోడికీ తనపై కోపమూ రాకూడదు. ఇటువంటి పరిస్దితుల్లో మాట్లాడిన మాటలే ఎవరికీ అర్ధం కాకుండా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి