తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం సహా, శ్రీశైలం, కాణిపాకం, కనకదుర్గమ్మ, సింహాచలం వంటి దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ దేవాలయాలు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటల తర్వాత తలుపులు మూసేస్తాయి. గ్రహణం పూర్తయ్యాక మహాసంప్రోక్షణ చేసి, తిరిగి దర్శనాల కోసం భక్తులను అనుమతిస్తారు. అయితే దేశంలో ఐదు ఆలయాలు మాత్రం ఎప్పటికీ మూతలు పడవు. గ్రహణం సమయంలోనూ పూజలు, నైవేద్యాలు యథావిధిగా కొనసాగుతాయి. అవేంటో చూద్దాం:
శ్రీకాళహస్తి – ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పవిత్ర క్షేత్రం గ్రహణ దోషాలకు అతీతం. వాయులింగ స్వరూపుడైన శివుడు ఇక్కడ వెలిశాడు. రాహు-కేతు పూజలు రోజూ జరుగుతాయి. కాబట్టి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఆలయం ఎప్పుడూ మూయరు.
విష్ణుపాద దేవాలయం – గయ (బీహార్) – పిండప్రదానం కోసం ప్రపంచప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రంలో గ్రహణ కాలం మరింత శుభప్రదమని భావిస్తారు. పితృదేవతలకు పిండప్రదానం చేసి, విష్ణువు పాదాలకు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత.
మహాకాళేశ్వర్ ఆలయం – ఉజ్జయిని (మధ్యప్రదేశ్) – జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుడు ఎప్పుడూ భక్తులకు దర్శనమిస్తూనే ఉంటాడు. గ్రహణం సమయంలోనూ ఆలయం తెరచి ఉంచుతారు. పూజ సమయాల్లో స్వల్ప మార్పులు మాత్రమే చేస్తారు.
లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్ (రాజస్థాన్) – ఇక్కడి ఆలయం చరిత్ర వెనుక ఓ మిరాకిల్ ఉంది. ఒకసారి గ్రహణ సమయంలో పూజారులు నైవేద్యం సమర్పించకపోవడంతో, స్వయంగా లక్ష్మీనాథుడు చిన్నవాడి రూపంలో బయటకు వచ్చి ఆహారం తిన్నాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ ఆలయం ఎప్పటికీ మూతపడదట.
తిరువార్పు కృష్ణ దేవాలయం – కేరళ – కొట్టాయం జిల్లాలోని ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలో మూయరాదు. ఒకసారి మూసివేయగానే శ్రీకృష్ణుడి విగ్రహం బలహీనమైందని నమ్మకం. అప్పటి నుంచి ఇక్కడ గ్రహణ సమయాల్లో కూడా నైవేద్యం యథావిధిగా సమర్పిస్తారు.
మొత్తానికి, చంద్రగ్రహణం రోజున దేశంలోని ఎక్కువశాతం ఆలయాలు మూసివేయబడుతున్నా, ఈ ఐదు ఆలయాలు మాత్రం ఎప్పటికీ తెరిచి ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాల కలయికలో ఈ చంద్రగ్రహణం భక్తులకు మరింత ప్రత్యేక అనుభూతి ఇవ్వనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి