అంద‌రూ ఊహించిన‌ట్టే జ‌రిగింది. టోక్యో ఒలింపిక్స్ జ‌రుగుతాయా..? జ‌ర‌గ‌వా..?  కొద్దిరోజులుగా ఇవే ప్ర‌శ్న‌లు.. ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికింది. క‌రోనా వైర‌స్‌తో పొంచివున్న ప్ర‌మాదాన్ని దృష్టిలో పెట్టుకుని టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేశారు. క‌రోనా వైర‌స్ బారిన ప‌డి ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ల‌క్ష‌ల్లో దాని బారిన‌ప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో అనేక దేశాలు లాక్‌డౌన్ ప్ర‌కటించాయి. తాజాగా, మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి భార‌త్‌లోనూ లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. అన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బ‌తింటున్నాయి.ఈ నేప‌థ్యంలో ‘కరోనా’ ప్రభావం ఒలింపిక్స్‌పై కూడా పడింది. ఇప్ప‌టికే దాదాపు 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ విస్త‌రించ‌డంతో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే నిర్ణ‌యానికి నిర్వాహ‌కులు వ‌చ్చారు. 

 

ఈ ఏడాది జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. మంగ‌ళ‌వారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో ఒలంపిక్‌ కమిటీ సమేవేశమైంది. విశ్వక్రీడలను ఏడాది పాటు వాయిదా వేయాలని ఆయ‌న కోరారు. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని కమిటీ ముందు ఉంచానని జపాన్‌ ప్రధాని అన్నారు. కాగా, జపాన్‌ ప్రధాని మాటలకు కమిటీ సానుకూలంగా స్పందించి... విశ్వక్రీడలను ఏడాదిపాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. అయితే.. ఇప్ప‌టికే.. ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఒలింపిక్స్‌ వాయిదా వేయాలని కోరాయి. ఒక‌వేళ‌ కొనసాగిస్తే తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దీంతో, విశ్వ క్రీడలను వాయిదా వేయక తప్పలేదని ఒలింపిక్‌ అధ్యక్షుడు.. థామస్‌ బాక్‌ తెలిపారు. వచ్చే ఏడాది(2021) టోక్యో వేదికగానే ఒలంపిక్స్‌ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

 

అయితే.. ఒలింపిక్స్‌ను వాయిదా వేసేందుకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ అంగీకరించిన‌ట్లు జ‌పాన్ ప్ర‌ధాని షింజే అబే తెలిపారు.  క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేయాల‌ని ప్ర‌తిపాదించాన‌ని, ఐఓసీ అధ్య‌క్షుడు థామ‌స్ బాక్‌ ఆ ప్ర‌తిపాద‌న‌ను నూరు శాతం అంగీక‌రించిన‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. నిజానికి..  జూలై 24వ తేదీ నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు 2020 ఒలింపిక్స్ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. విశ్వ‌క్రీడల చ‌రిత్ర‌లో ఒలింపిక్స్‌ను వాయిదా వేయ‌డం ఇదే మొద‌టిసారి అని, గ‌తంలో వ‌ర‌ల్డ్ వార్ స‌మ‌యంలో క్రీడ‌ల‌ను ర‌ద్దు చేశార‌ని, కానీ తొలిసారి వాయిదా వేస్తున్నార‌ని ప‌లువురు అధికారులు చెప్పారు. కాగా, ఒలింపిక్స్ ఏర్పాట్ల కోసం ఇప్ప‌టికే జ‌పాన్ సుమారు 30 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: