సిడ్నీ: ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. స్మిత్ మళ్లీ సెంచరీ బాదాడు. మ్యాక్స్‌వెల్ ఈ సారి కూడా భీకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ అర్థ సెంచరీతో రాణించాడు. ఫలితంగా ఆసిస్ కొండంత స్కోరు చేసింది. భారత్‌ముందు రికార్డు స్థాయిలో 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భారత్ మొదటి మ్యాచ్‌లోలానే తడబడింది. ఓపెనర్లు నిరాశపరిచారు. కోహ్లీ, రాహుల్ పోరాడినా, మిగతా బ్యాట్స్‌మెన్ కొద్దో గొప్పో ఆడినా టార్గెట్ మాత్రం అందుకోలేకపోయారు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ ఆసీస్ సొంతమైంది.

తొలుత టాస్ గెలిచిన ఆసిస్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లోలానే ఆసీస్‌కు ఓపెనర్లు అద్భుత ఆరంభాన్నించ్చారు. డేవిడ్ వార్నర్(77 బంతుల్లో 83), ఆరోన్ ఫించ్(69 బంతుల్లో 60) అర్థ సెంచరీలతో అదరగొట్టారు. 100 పరుగులు దాటిన తరువాత ఫించ్ అవుటవడంతో స్టీవ్ స్మిత్(64 బంతుల్లో 104) క్రీజులోకి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లోలానే కళాత్మకమైన షాట్లతో భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మళ్లీ సెంచరీ సాధించాడు. 25వ ఓవర్లో వార్నర్ రనౌటైన తరువాత క్రీజులోకి వచ్చిన లబుషేన్(61 బంతుల్లో 70) కూడా స్మిత్‌కు చక్కగా సహకరించాడు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 63) మళ్లీ వీరవిహారం చేశాడు. ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆసీస్ 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్‌పై వన్డేల్లో అత్యధిక స్కోరును సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లలో షమి, పాండ్యా, బూమ్రాలకు ఒక్కో వికెట్ దక్కాయి.

ఇక భారత బ్యాటింగ్‌ ప్రారంభంలోనే తడబడింది. క్రీజులోకి రావడతోనే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధవర్(23 బంతుల్లో 30) ఓ చెత్త షాట్‌తో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడం, ఆ వెంటనే మయాంక్ అగర్వాల్(26 బంతుల్లో 28) కూడా నిర్లక్ష్యపు షాట్‌తో కీపర్ క్యాచ్‌గా అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ కోహ్లీ(87 బంతుల్లో 89) క్రీజులో పాతుకుపోయాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 38) కొంత సేపు సహకరించినా.. మిడ్‌వికెట్‌లో స్మిత్ అద్భుత క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్(66 బంతుల్లో 76) కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ సంయమనంతో ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును నడించారు. అయితే 34వ ఓవర్లో కోహ్లీ అవుట్ కావడంతో భారం మొత్తం రాహుల్ ‌పైనే పడింది. కానీ జాంపా తన స్పిన్‌తో రాహుల్‌ దెబ్బతీశాడు. ఇక పాండ్యా(31 బంతుల్లో 28) కూడా మొదటి మ్యాచ్‌లోలా రాణించలేకపోయాడు. చివర్లో జడేజా 2, 3 బౌండరీలు బాదినా ఉపయోగం లేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది. 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌కు చేజిక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: