ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ కాబోతోంది. తమను విశ్వ విజేతగా మారకుండా అడ్డుకున్న ప్రత్యర్థిని మట్టి కరిపించే లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది. ఈ సారి మరింత పటిష్ఠంగా, రెట్టింపు అనుభవంతో సంప్రదాయ క్రికెట్‌లో ఢీకొట్టబోతోంది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి చెబుతున్నానో. అవును.. టీమిండియా-న్యూజిల్యాండ్ గురించే. జూన్‌‌లో జరగబోతున్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌‌లో కివీస్‌తో భారత్ తలపడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌కు వేదిక, తేదీ ఖరారైంది. ఈ వివరాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.


ఆస్ట్రేలియా చారిత్రక సిరీస్‌ విజయం అనంతరం అదే ఆత్మస్థైర్యంతో స్వదేశంలో ఇంగ్లాండ్‌ను కూడా టీమిండియా మట్టి కరిపించింది. సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ మ్యాచ్‌ ఏ వేదికలో, ఏ తేదీన నిర్వహిస్తారనే ప్రశ్న చాలా రోజుల నుంచి ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే బీసీసీఐ సోమవారం దీనికి సమాధానమిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై ఈ రోజు(సోమవారం) ఓ ప్రకటన చేశారు.

ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ మైదానం ఈ టెస్టుకు వేదిక కాబోతోందని ఆయన వెల్లడించారు. ఈ మ్యచ్ జూన్ 18న ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే ఈ విషయం చాలా రోజుల క్రితమే నిర్ధారణ అయిందని, ఆటగాళ్లు బస చేసేందుకు అవసరమైన హోటల్‌ కూడా స్టేడియానికి సమీపంలోనే ఉండడంతో ఈ వేదికను ఎంపిక చేసినట్లు చెప్పారు. కాగా.. ఈ కారణంతోనే ఇంగ్లండ్ ఈ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి ఇష్టపడేదని గంగూలీ వెల్లడించారు.

2019లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాను కివీస్ ఓడించింది. సులభమైన మ్యాచ్ సైతం వర్షం పడడంతో భారత్ చేయి జారిపోయింది. రిజర్వ్ డేలో జరిగిన మ్యాచ్ కావడంతో పిచ్ పరిస్థితులు ఇండియాకు అనుకూలించలేదు. దీనికి తోడు బ్యాట్స్‌మన్ వైఫల్యం జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో న్యూజిల్యాండ్‌ భారత్‌ను సులభంగా ఓడించింది. ఈ ఓటమి టీమిండియానే కాకుండా ప్రతి భారత క్రికెట్ అభిమానినీ కలచివేసింది.

అన్నింటికంటే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రనౌట్ అయిన తరువాత అతడి కళ్లలో తిరిగిన కన్నీళ్లు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులు మరచిపోలేరు. ఆ మ్యాచ్ ఓటమి తరువాత ధోనీ మళ్లీ టీమిండియా జెర్సీ ధరించలేదు. కారణం ఏదైనా ఆ మ్యాచ్ ఓటమి ధోనీని బాధించిందనే విషయం మాత్రం నిజం. ఆ బాధతోనే ఆయన రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు అదే జట్టును చిత్తు చేసి క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం భారత్ ముందుంది. మరి ఈ సారి అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: