కరోనా కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ అయితే.... ప్రేక్షకులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసి మరీ నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ ఏడాది కొన్ని మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించినప్పటికీ... కరోనా కేసులు పెరగడంతో... టోర్నీ మళ్లీ దుబాయ్‌కు మార్చేసింది భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్పుడు జరుగుతున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులను అనుమతించకుండానే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. అయితే... కనీసం ఒక్క మ్యాచ్‌ కోసం అయినా... ప్రేక్షకులను అనుమతించాలనే డిమాండ్ ఊపందుకుంది. వాస్తవానికి ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాలి. కానీ కరోనా కారణంగా టోర్నీని యూఏఈ, ఒమన్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు కూడా చేస్తోంది.

అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ... నవంబర్ 14వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయి ఇంటర్‌ నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్ ముగిసిన రెండు రోజులకే ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐలేఖ రాసింది. నవంబర్ 14వ తేదీన జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలోనికి ప్రేక్షకులను అనుమతించాలని లేఖలో కోరింది. కనీసం 25 వేల మందిని అనుమతించాలని కోరింది. ఇందుకోసం యూఏఈ ప్రభుత్వానికి కూడా బీసీసీఐ లేఖ రాసింది. అనుకూలంగానే నిర్ణయం వస్తుందని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో కరోనా వైరస్ పూర్తి కంట్రోల్‌లో ఉంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. నిబంధనలు పాటిస్తూ..... రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీకి అనుమతిస్తున్నారు. అలాగే 16 ఏళ్ల వయసు నిండిన వారికే పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీ పీసీఆర్ టెస్టులో నెగటివ్ రిపోర్డు కూడా తప్పనిసరి. ఇవే నియమాలను ఫైనల్ మ్యాచ్ కోసం కూడా అమలు చేస్తూ... 25 వేల మందిని అనుమతించాలని బీసీసీఐ లేఖలో కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: