ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ ఉల్ హక్‌కి, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఇందుకు కారణం ఈ ప్లేయర్ మే 1న కోహ్లీతో వాగ్వాదానికి దిగడమేనని చెప్పవచ్చు. నవీన్ మైదానంలో కోహ్లితో వాదించడమే కాకుండా సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు చేస్తున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న కోహ్లీ ఫ్యాన్స్ అతడిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా, నవీన్ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్‌ను వెక్కిరిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే నవీన్ సోషల్ మీడియా ఖాతా నుంచి విరాట్ కోహ్లీకి సారీ చెప్పడం జరిగింది. ఐయామ్‌ సారీ విరాట్ కోహ్లీ సార్ అంటూ చెప్పిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసి చివరికి నవీన్‌కి బుద్ధి వచ్చిందని, ఇప్పటిదాకా చేసిన తప్పులకు అతడు పశ్చాత్తాప పడుతున్నాడని అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ అసలు విషయాన్ని తర్వాత గ్రహించి వారు షాక్ అయ్యారు.

నిజానికి నవీన్ విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పనేలేదు. ఒక ఫేక్ అకౌంట్ నవీన్ పేరుతో వెరిఫికేషన్ మార్కు పొంది విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, విరాట్ కోహ్లీ తనకు ఫేవరెట్ క్రికెటర్ అని, చిన్నప్పటినుంచి తనని ఆరాధిస్తూ వస్తున్నానని, తన రూమ్ నిండా విరాట్ కోహ్లీ ఫోటోలే ఉన్నాయని నవీన్ చెప్పినట్లు ఈ ఫేక్ అకౌంట్ అందరినీ నమ్మించింది. అది మాత్రమే కాదు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ని వదిలి విరాట్ కోహ్లీ కింద RCBకి ఆడాలని ఉందని నవీన్ అన్నట్లు ఈ ఫేక్ అకౌంట్ రాసుకొచ్చింది.

ఈ వైరల్ పోస్ట్ తన దృష్టికి రావడంతో అసలైన నవీన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇది ఒక ఫేక్ అకౌంట్ అని, తాను విరాట్ కోహ్లీకి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని స్పష్టం చేశాడు. మొదటిగా నవీన్ నిజంగానే క్షమాపణ చెప్పాడని నమ్మిన ఫ్యాన్స్ ఆ తర్వాత ఉసూరుమన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl