టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలవడంతో పాటు, టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘటనకు తెరలేపింది. ఒకే టెస్ట్ మ్యాచులో ఐదు శతకాలు సాధించినప్పటికీ ఓడిన తొలి జట్టుగా భారత్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 148 సంవత్సరాల పాటు ఎప్పుడూ ఏ దేశం కూడా ఒకే టెస్టులో ఐదు సెంచరీలు కొట్టి ఓడిపోలేదు. కానీ భారత జట్టు మాత్రం ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. మ్యాచ్‌ లో రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు (134, 118) సాధించగా, యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), కేఎల్ రాహుల్ (137) ఒకొక్క శతకం నమోదు చేశారు. మొత్తం ఐదు శతకాలు బాదినప్పటికీ జట్టు విజయం సాధించలేకపోవడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

ఇంత గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత కూడా భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ విఫలమవడమే కావడంతో పాటు మ్యాచ్ లో అనేక క్యాచ్ లు డ్రాప్ చేయడమే. భారత బౌలర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఒత్తిడి చూపడంలో విఫలమవ్వడంతో, ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. స్పిన్నర్లు సహా పేస్ బౌలింగ్ యూనిట్ అంచనాలను తీరకపోవడంతో, టీమ్‌ ఇండియాకు గెలుపు దూరంగా మారింది. ఆట గమనాన్ని చూస్తే, రన్‌లు చేసినప్పటికీ కీలక దశల్లో వికెట్లు పడలేకపోవడం భారత్‌ను నిలువరించింది. ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యం కూడా మ్యాచ్ ఆడదానికి ప్రధాన కారణాలలో ఒక్కటిగా చెప్పవచ్చు.

ఈ పరాజయం టీమ్ ఇండియాకు గట్టిగా మేలుకలుగించే అవకాశం ఉంది. మంచి బ్యాటింగ్‌ను విజయం దిశగా మలచాల్సిన అవసరం ఎంతయినప్పటికీ, బౌలింగ్ విభాగం స్థిరంగా ఉండకపోతే ఎలా గెలవలేమో ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఇప్పుడు భారత్‌కు మిగిలిన టెస్టుల్లో తిరిగొచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రికార్డు మాత్రం క్రికెట్ చరిత్రలో శాశ్వత ముద్రగా నిలిచిపోనుంది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుక పడింది. సిరీస్ లోని  రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుండి బర్మింగ్‌ హామ్‌ లో మొదలు కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: