ఆట ఏదైనా సరే కావొచ్చు — కానీ “ప్రపంచకప్” అనే మాట ప్రతి క్రీడాకారుని మనసులో ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది కేవలం టోర్నమెంట్ కాదు, ప్రతి ఆటగాడు నెరవేర్చాలని కలగంటూ పయనించే ఓ మహత్తర స్వప్నం. భారతదేశంలో బ్యాట్ లేదా బంతి పట్టిన ప్రతి అమ్మాయి గుండెల్లో కూడా అదే కల దాగి ఉంది — ఒకరోజు బ్లూ జెర్సీతో క్రీడా రంగంలో నిలబడి, ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని. 1978లో మొదటిసారి భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ వేదికపై అడుగు పెట్టింది. ఆ క్షణం నుంచి ఇప్పటి దాకా ఈ దేశం ఎన్నో తరం ఆటగాళ్లతో ఆ కలను చేధించేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. ప్రతి దఫా ఆశలు ఆకాశాన్నంటాయి, కానీ ఫలితం మాత్రం ఒక్కోసారి చేతిలోంచి జారిపోయింది.2005లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత సేన ఫైనల్ వరకు చేరింది. అద్భుత ప్రదర్శనతో కప్పు దగ్గరికి వచ్చేసరికి, ఆస్ట్రేలియా జట్టు ఆ కలను చెదరగొట్టింది. అయినా ఆశలు చనిపోలేదు. కాలం తిరిగింది, కొత్త జట్టు రూపుదిద్దుకుంది. 2017లో మరోసారి మిథాలీ సారథ్యంలోని జట్టు గెలుపు కోసం గట్టి పోరాటం చేసింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఆ ఫైనల్‌లో కప్పు మళ్లీ చేతికి అందినట్టే అందకుండా పోయింది.


అయితే ఈసారి మాత్రం కథ వేరేలా వ్రాయబడింది. “మూడోసారి ముచ్చట తప్పదేనా?” అన్న ప్రశ్నతో దేశమంతా ఎదురుచూసింది. ఆదివారం నాడు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఆశలతో, అంచనాలతో ఉత్కంఠభరిత వాతావరణంలో నిండిపోయింది. లక్షలాది భారతీయుల ఆశీర్వాదాలతో, కోట్ల గుండెల ధ్వనితో గ్రౌండ్‌లో అడుగు పెట్టింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా — తొలి వికెట్‌కే శతక భాగస్వామ్యం! 27 ఓవర్లకు స్కోరు 162/1! ఆ సమయంలో ప్రేక్షకుల ఉత్సాహానికి అంతే లేదు — “ఇంకా 350 దాటుతాం, సునాయాసంగా విజయం సాధిస్తాం” అనుకున్నారు అందరూ. కానీ క్రికెట్ అనేది అంచనాలను తలకిందులు చేసే ఆటే కదా! ఇన్నింగ్స్ చివరికి స్కోరు 299 పరుగులకే పరిమితమైంది. అదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోరు కంటే ఇది 40 పరుగులు తక్కువ. అందుకే అభిమానుల్లో కొంత అనుమానం — ఈ స్కోరును కాపాడుకోగలమా?



కానీ కెప్టెన్ ముందుండి ప్రేరణనిచ్చింది. సఫారీ జట్టు 39 ఓవర్లకు 207/5తో నిలిచినప్పుడు పరిస్థితి కొంచెం టెన్షన్‌గా కనిపించింది. అయినా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన ఘనవిజయం కేవలం అదృష్టం కాదని మరోసారి రుజువు చేశారు మన ఆడబిడ్డలు. “మేమే అసలైన ఛాంపియన్లు” అని నినదిస్తూ, ఒక్కసారిగా జూలు విరిచారు.బౌండరీలు, క్యాచ్‌లు, రన్‌అవుట్‌లు — ప్రతి క్షణం ఉత్కంఠభరితమైంది. జట్టులోని పదకొండు మంది ఒక్కొక్కరు ప్రాణం పెట్టి ఆడారు. ఒక్కో రన్‌కి విలువ అర్థం చేసుకున్నారు. చివరి ఓవర్లలో దేశం మొత్తం శ్వాస బిగపట్టి చూసింది — ఆ చివరి బంతి పడగానే ఆవేశం, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి.



అలా దశాబ్దాలుగా కష్టపడి సాధించిన కల నెరవేరింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను తమ చేతుల్లోకి ఎత్తుకుంది. ఆ క్షణం కేవలం ఆటగాళ్లది కాదు — అది దేశమంతా గర్వపడే క్షణం.ఇది కేవలం విజయం కాదు — ప్రతి అమ్మాయి కలకు న్యాయం చేసిన ఘనత. ప్రతి చిన్నపిల్లకు “నేనూ సాధించగలను” అనే నమ్మకం ఇచ్చిన ప్రేరణ. ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది.ఆ కలల కప్పు — ఇక కల కాదు. అది ఇప్పుడు భారత ఆడబిడ్డల గర్వకిరీటం!

మరింత సమాచారం తెలుసుకోండి: