
ఈ హై-స్పీడ్ రైలును ప్రారంభించిన తొలి సంవత్సరాల్లో జపాన్ రైల్వే ఇంజినీర్లు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. రైలు గంటకు 300కి.మీ వేగంతో సొరంగం నుంచి బయటకు వస్తున్నప్పుడు, తుపాకీ పేలుడు లాంటి భారీ శబ్దం వినిపిస్తూ ఉండేది. ఆ శబ్దం 70 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండేది. అది రైల్వే ట్రాక్‌ల పక్కన నివసించే ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఒక దశలో ఈ ప్రాజెక్టును రద్దు చేయాలా అనే స్థాయికి సమస్య వెళ్లింది. కానీ జపాన్ ఇంజినీర్లు "సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది" అనే దృక్పథంతో ముందుకు సాగారు.
ఆ సమయంలో జపాన్ రైల్వే టెక్నికల్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఈజి నకట్సు అనే ఇంజనీర్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. పక్షులపై ఆసక్తి కలిగిన పక్షి ప్రేమికుడు ఆయన. ఈ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాడు. ఒక రోజు కింగ్‌ఫిషర్ పక్షి నీటిలో చేపలను పట్టుకునే విధానాన్ని గమనించిన ఆయనకు ఒక ఐడియా వచ్చింది. కింగ్‌ఫిషర్ పక్షి పొడవాటి ముక్కు కారణంగా అది నీటిలోకి దూకేటప్పుడు చెలరేగే శబ్దం చాలా తక్కువగా ఉంటుందని ఆయన గుర్తించాడు. ఈ సూత్రాన్ని బుల్లెట్ ట్రైన్ ముందుభాగం డిజైన్‌లో అమలు చేశారు.
ఇంజినీర్లు ట్రైన్ ముందుభాగాన్ని కింగ్‌ఫిషర్ ముక్కు ఆకారంలో మలచడంతో, సొరంగం నుంచి బయటకు వస్తున్నప్పుడు శబ్దం గణనీయంగా తగ్గింది. అదేవిధంగా రైలుకు స్థిరత్వం పెరిగింది, ఇంధనం వినియోగం తగ్గింది, వేగం మరింత పెరిగింది. బయోమిమిక్రి అనే సూత్రానికి జపాన్ బుల్లెట్ ట్రైన్ ఓ అద్భుత ఉదాహరణ. ప్రకృతిలోని జీవుల నిర్మాణాలు, శరీర ఆకృతులు, వారి సహజ ప్రతిభ నుండి మనిషి నేర్చుకొని అద్భుత ఆవిష్కరణలు చేయగలడని ఈ ట్రైన్ నిరూపించింది.
ఈ ట్రైన్ విజయంతో, ఇతర దేశాలు కూడా తమ రైల్వే వ్యవస్థలో కొత్త సాంకేతికతలను అమలు చేయడం ప్రారంభించాయి.
ఒకప్పుడు రద్దు కావాల్సిన ప్రాజెక్ట్ నేడు జపాన్ ప్రగతికి చిహ్నంగా నిలిచింది. ఇది ప్రపంచానికి ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. “ప్రకృతిని గమనిస్తే సమస్యలకు సమాధానాలు మన చుట్టుపక్కలే ఉంటాయి.” జపాన్ బుల్లెట్ ట్రైన్ కేవలం ఒక రైలు కాదు, అది మానవ మేధస్సు, సహనం, ప్రకృతి పరిశీలన, సాంకేతికతల సమ్మేళనంతో పుట్టిన ఇంజనీరింగ్ అద్భుతం. కింగ్‌ఫిషర్ పక్షి ముక్కు ఆకారం ఎలా ఒక సాంకేతిక విప్లవానికి మార్గం చూపిందో ఈ కథ అందరికీ స్ఫూర్తిదాయకం.