
ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్ లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్ మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్సుల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు.అధికారులు కూడా బిల్డర్ తో మిలాఖత్ అయ్యి నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నలుగురు 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
నిర్మాణం అక్రమమేనని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని గతేడాది ఆగస్ట్ 31న కోర్టు ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తికావాలి. కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆదివారం నాడు టవర్స్ ను నేలమట్టం చేశారు.ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతను బ్రిటన్ నిపుణులు పర్యవేక్షించారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి..హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.
అలాగే శిథిలాలు అపార్ట్ మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. ట్విన్ టవర్స్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్ లో నివసిస్తున్న 5 వేల మందిని ఖాళీ చేయించారు. వారికి చెందిన 1200 వాహనాలను కూడా అక్కడ్నుంచి తరలించారు. భవనాన్ని పేల్చి వేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోకుండా ఇంజినీరింగ్ నిపుణులు చర్యలు చేపట్టారు. దీంతో రెండు టవర్లు కూడా ఉన్నచోటే నిలువుగా కుప్పకూలిపోయాయి. పేలుడు ప్రభావం 50 మీటర్లవరకే ఉంది.