భారతదేశం నుంచి మరో అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ నిష్క్రమిస్తోంది. అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ భారతదేశం నుంచి వెళ్లి పోతోంది. ఇక్కడ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తోంది. ఫోర్డ్ తన రెండు కార్ల తయారీ కర్మాగారాలను మూసివేస్తోంది. తమిళనాడు, గుజరాత్ లోని కార్ల ప్లాంట్లను 2022 త్రైమాసికంలో మూసివేయనుంది. 2017లో జనరల్ మోటార్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ కంపెనీ కూడా గత సంవత్సరం వాహన తయారీని ఆపేసింది. ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ వెళ్లిపోతుండడంతో బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అంటున్నారు. 

దశాబ్ద కాలంగా ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో రెండు వందల కోట్ల డాలర్లకు పైగా నష్టపోయింది. ఇక్కడ ఆ కంపెనీ కొత్త వాహనాలకు డిమాండ్ లేకుండా పోయింది. 25 ఏండ్ల నుంచి ఆ కంపెనీ భారతదేశంలో పోటీని తట్టుకోలేకపోతోంది. ప్యాసెంజర్ వాహనాల తయారీ మార్కెట్ లో ఫోర్డ్ రెండు శాతం వాటాను కూడా అందుకోలేకపోయింది. భారతదేశంలో ఆ కంపెనీ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీంతో కంపెనీ ఇక్కడ మూతపడనుంది. ఐదు రకాల కార్లను తయారు చేస్తున్న ఫోర్డ్ తమ వినియోగదారుల కోసం విడి భాగాల పంపిణీతోపాటు వాహన నిర్వహణ సేవలను మాత్రం కొనసాగించనుంది. ఎగుమతుల కోసం కారు ఇంజిన్ల తయారీని మాత్రం కొనసాగిస్తామని ఫోర్డ్ కంపెనీ చెబుతోంది. 

విదేశీ కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను చేసేలా తోడ్పడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నా, ఒక్కొక్కటిగా దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదురుకావడంతో బడా కంపెనీలు జారుకుంటున్నాయి. భారతదేశంలోని బీజేపీ పెంచి పోషిస్తున్న కార్పొరేట్లను మరింత పెద్దచేయాలనే కుట్రలో భాగంగానే ఇలా జరుగుతోందని చెబుతున్నారు. దేశ మార్కెట్ ను కొందరే శాసించాలనే బీజేపీ రహస్య ఎజెండా అమలుతోనే విదేశీ కంపెనీలు వెళ్లిపోతున్నాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: