సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు యుద్ధ‌మే చేస్తున్నారు. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో య‌మ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈక్ర‌మంలోనే ఫేక్ అకౌంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కొంద‌రు నేత‌ల పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ఇష్టారాజ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ అకౌంట్ల‌ను ఈశాన్య రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా న‌డిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నేడు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఆదివారం ఫిర్యాదు చేయ‌డం దుమారం రేపుతోంది. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న‌ కోరారు.

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులేనని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వలకు చిక్కక తప్పదని ఆయ‌న అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విడిచి పెట్టరని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు. అయితే.. ఈ ఫిర్యాదుతో ఫేక్ గ్యాంగ్‌లో వ‌ణుకుపుట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: