బెంగళూరు: పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ అనేక రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ ముందుండగా.. మధ్యప్రదేశ్, కర్ణాకట రాష్ట్రాలూ అదే రకమైన చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే ఈ చట్టానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన కూడా చేసింది. అయితే ప్రభుత్వం అలా ప్రకటించిందో లేదో.. అక్కడి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ‘లవ్ జీహాద్’ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. ‘తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పౌరుల వ్యక్తిగత అభిప్రాయం.. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’’ అని వ్యాఖ్యానించింది. వజీద్ అనే వ్యక్తి వేసిన హెబియాస్ కార్పస్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది.  ప్రేమ, పెళ్లి పేరుతో మతం మారుతున్నారనే కారణంతో అన్యమతస్థుల మధ్య వివాహ నిషేధానికి ‘లవ్ జిహాద్’ పేరుతో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.



వజిద్ అనే యువకుడు రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రమ్య కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అంతే కాకుండా రమ్యను బెంగళూరులోని విద్యారన్యపురలో ఉన్న మహిళా దక్షత సమితి భవనంలో బంధించారు. దీనిపై వాజిద్ హైకోర్టును ఆశ్రయించారు. ‘నేను, నా కోలీగ్‌ రమ్య ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అయితే మా ఇద్దరి తల్లిందండ్రులూ దీనికి అంగీకరించలేదు. రమ్య తల్లిదండ్రులు ఆమెను వేరే చోట బంధించారు. అమ్మ, నాన్న నన్ను కూడా ఇంటి నుంచి కదలకుండా చేశారు. మాకు కోర్టే న్యాయం కల్పించాలి’ అంటూ హైకోర్టులో హెబియస్ కార్పర్ పిటిషన్‌ వేశాడు. రమ్య స్టేట్‌మెంట్‌ను కూడా రికార్టు చేసి తన పిటిషన్‌కు జత చేసి కోర్టుకు అందించాడు.

 

వజిద్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘మన దేశంలో మేజర్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్లు ఇష్టపడే వారిని వివాహం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన స్వేచ్ఛ విషయంలో కులానికి కానీ మతానికి కానీ ప్రవేశం లేదు. ఇది ప్రాథమిక హక్కు. దీనిని ఎవరూ కాదనలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎస్ సుజాత, జస్టిస్ సచిన్ శంకర్ మాగడంలు సంయుక్తంగా ఈ తీర్పునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: